“గ్యాంగ్‌ లీడర్‌” మూవీ ఎలా ఉందంటే?

ఓ రివైంజ్ స్టోరీ రైట‌ర్‌. త‌న‌ని వెదుక్కుంటూ అయిదుగురు ఆడ‌వాళ్లు. త‌మ రివైంజ్ లో స‌హాయం చేయ‌మ‌ని కోర‌డం దాని వెనుక 300 కోట్ల బ్యాంకు రాబ‌రీ ఉండ‌డం – సూప‌ర్బ్ ప్లాట్‌! ఇప్పుడొస్తున్న క‌థ‌ల‌కు భిన్నంగా సాగిన లైన్ ఇది. విక్ర‌మ్ త‌ల‌పెట్టిన స‌గం ప‌ని పూర్త‌య్యింది. మిగిలిన స‌గం – స్క్రీన్ పై చూపించ‌డ‌మే. మ‌రి ఆ స‌గం ఏమైంది? విక్ర‌మ్ స్క్రీన్ ప్లే మ్యాజిక్‌, నాని స్టార్ డ‌మ్‌, త‌న స‌హ‌జ‌మైన న‌ట‌న – మిగిలిన స‌గం ప‌నిని పూర్తి చేశాయా? ఇంట్ర‌డ‌క్ష‌న్లోనే కథేంటో అర్థ‌మైపోయి ఉంటుంది. నేచుర‌ల్ స్టార్ నాని… వ‌రుస‌గా ఎనిమిది విజ‌యాల‌ను సాధించిన యువ హీరో. ఇన్ని విజయాల‌కు కృష్ణార్జున‌యుద్ధం, దేవ‌దాస్ చిత్రాలు కాస్త బ్రేకులు వేసినా జెర్సీ`తో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు నాని. `జెర్సీ`లాంటి ఎమోష‌న‌ల్ చిత్రం త‌ర్వాత నాని డిఫ‌రెంట్‌గా కామెడీ క‌ల‌గ‌ల‌సిన రివేంజ్ డ్రామా చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నాడు. `ఇష్క్‌, మ‌నం చిత్రాల ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రంలో నాని పెన్సిల్ పార్థ‌సార‌థి అనే ఓ క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డతాడ‌ని పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌, ప్రోమోలు చూస్తే అర్థ‌మ‌య్యాయి. వేర్వేరు వ‌య‌సులున్న ఐదుగురు మ‌హిళ‌లు ప్రతీకారం తీర్చుకోవాల‌నుకుంటారు. వారికి పెన్సిల్ పార్థ‌సార‌థి అనే డ‌బ్బింగ్ చిత్రాల ర‌చ‌యిత ఎలా ఉప‌యోగ‌ప‌డ్డాడ‌నేది తెలుసుకోవాలంటే ముందు నాని`స్ గ్యాంగ్‌లీడ‌ర్‌ సినిమాలోకి వెళ్లాల్సిందే…క‌థ‌:
సిటీలో ఓ రోజు అర్ధ‌రాత్రి బ్యాంకు దోపీడీ జ‌రుగుతుంది. ఆ దోపీడీలో ఆరుగురు పాల్గొంటారు. బ్యాంకులో డ‌బ్బు దోచుకున్న త‌ర్వాత ఆరుగురులో ఒక‌డు మిగిలిన ఐదు మందిని చంపేస్తాడు. అలాగే అక్క‌డున్న మ‌రో ముస‌లివాడిని కూడా చంపేస్తాడు. పోలీసులు ఎంత ప్ర‌య‌త్నించినా దొర‌క‌డు. దొంగ‌త‌నం జ‌రిగిన 14 నెల‌లు త‌ర్వాత స‌రస్వ‌తి(ల‌క్ష్మి).. మ‌ధ్య‌వ‌య‌స్కురాలైన వ‌ర‌ల‌క్ష్మి(శ‌రణ్య‌), పెళ్లి కాబోతున్న అమ్మాయి ప్రియ‌(ప్రియాంక‌), స్కూల్ చ‌దువుతున్న అమ్మాయి స్వాతి(శ్రియారెడ్డి), ఐదారేళ్ల చిన్న‌పాప (పాణ్య‌)ల‌కు బహుమ‌తి వ‌చ్చింద‌ని అబ‌ద్ధం చెప్పి ఇంటికి ర‌ప్పిస్తుంది. బ్యాంకు రాబ‌రీలో ఆరోవాడు త‌మ‌కు కావాల్సిన ఐదుగురుని చంపేశాడు కాబ‌ట్టి.. వాడెవ‌డో క‌నిపెట్టి ప‌గ తీర్చుకుందామ‌ని చెబుతుంది. ముందు ఒప్పుకోక‌పోయినా త‌ర్వాత అంద‌రూ ఒప్పుకుంటారు. అయితే వీరికి సాయ‌ప‌డేందుకు పెన్సిల్ పార్థ‌సార‌థి(నాని) అనే డ‌బ్బింగ్ సినిమాల ర‌చ‌యిత సాయాన్ని కోర‌తారు. ప్రియ‌ను చూసి ఇష్ట‌ప‌డ్డ పెన్సిల్ వారికి సాయం చేయ‌డానికి అంగీక‌రిస్తాడు. క్ర‌మంగా పెన్సిల్ త‌న తెలివి తేట‌ల‌తో దొంగ‌త‌నం చేసిదెవ‌రో క‌నుక్కొంటాడు. ఇంత‌కు దొంగ‌త‌నం చేసిందెవ‌రు? దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ రేస‌ర్ దేవ్‌(కార్తికేయ‌), పెన్సిల్‌కి మ‌ధ్య గొడ‌వేంటి? దొంగ‌తనానికి, దేవ్‌కి లింకేంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌
ఈ ఏడాది జెర్సీ`తో ఊపు మీదున్న నాని న‌టించిన చిత్రం `గ్యాంగ్ లీడ‌ర్‌. చుట్టూ ఐదుగురు ఆడ‌వాళ్లు, వారి మ‌ధ్య నాని… వాళ్లంద‌రికీ ఓ టార్గెట్‌. అత‌ని పేరు రేస‌ర్ దేవ్‌. క్లుప్తంగా క‌థ ఇది. ఈ చిత్రంలో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రూ ఆల్రెడీ ఆర్టిస్టులుగా నిరూపించుకున్న‌వాళ్లే. ఎవ‌రి పాత్ర‌ల్లో వాళ్లు స‌రిగ్గా స‌రిపోయారు. రైట‌ర్ పెన్సిల్ పార్థ‌సార‌థిగా నాని, అత‌ని ఫ్రెండ్ గా ప్రియ‌ద‌ర్శి, బామ్మ‌గా ల‌క్ష్మి, కొడుకును పోగొట్టుకున్న అమ్మ‌గా శ‌ర‌ణ్య‌, కాబోయేవాడిని పోగొట్టుకున్న వ్య‌క్తి ప్రియాంక‌.. ఇలా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. సినిమా ప్రారంభంలో చూపించే స‌న్నివేశాలు బాగున్నాయి. చీక‌ట్లో జ‌రిగిన ఆ స‌న్నివేశాల క‌న్నా, వాటి వెనుక వ‌చ్చే రీరికార్డింగ్ మెప్పించింది. అనిరుద్ చేసిన సంగీతం స‌న్నివేశాల‌తో క‌లిసిపోయినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని సీన్ల‌ను ఎలివేట్ చేసింది. ఇంటి నిండా వేల‌కొల‌ది పుస్త‌కాలుగా బెండు ముక్క‌ల‌ను పెట్టిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ట్రైల‌ర్‌లోనూ, టీజ‌ర్‌లోనూ చూపించిన స‌న్నివేశాలే సినిమాకు హైలైట్ స‌న్నివేశాలు. రేస‌ర్ పాత్ర‌లో కార్తికేయ చాలా బాగున్నాడు. యాటిట్యూడ్ కూడా చ‌క్క‌గా చూపించ‌గ‌లిగాడు. ఓ వైపు త‌ప్పు చేశాన‌న్న బాధ‌తో లోలోప‌ల భ‌య‌ప‌డుతూ, మ‌రోవైపు రేస‌ర్‌గా లైమ్‌లైట్‌లో ఉండే పాత్ర‌కు అత‌ను చ‌క్క‌గా సూట్ అయ్యాడు. లొకేష‌న్లు కూడా నేచుర‌ల్‌గా ఉన్నాయి. డైలాగుల పరంగా అక్క‌డ‌క్క‌డా న‌వ్వులు పండించారు. వెన్నెల‌కిశోర్ ఈ సారి ఇంకో వైవిధ్య‌మైన పాత్ర‌లో చేశారు. కెమెరాప‌నిత‌నం బాగుంది. కాస్ట్యూమ్స్ ప‌రంగానూ నేచురాలిటీ ఇట్టే క‌నిపిస్తుంది. కాక‌పోతే అనూహ్య‌మైన మలుపులు లాంటివాటిని చిత్రంలో ఆశించ‌లేం. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, క్లైమాక్స్ సీన్ కూడా రొటీన్‌గానే సాగింది. ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్ వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి మ‌ళ్లీ రొటీన్ అయింది.

ప్ల‌స్ పాయింట్స్‌:
– న‌టీన‌టులు
– కెమెరా ప‌నితనం
– బ్యాగ్రౌండ్ స్కోర్‌
– అక్క‌డ‌క్క‌డా న‌వ్వించారు

మైన‌స్ పాయింట్స్‌:
– క‌థ‌, క‌థ‌నం
– పాట‌లు
– గ్రిప్పింగ్‌గా లేని స‌న్నివేశాలు

Copy Protected by Chetan's WP-Copyprotect.