నాగార్జునకి “60 ఏళ్లు”! ఫిట్‌నెస్‌ విషయంలోనే కాదు నాగ్‌ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు!

ఫిట్‌నెస్‌ మెయింటెయిన్ చేయటంలో ఆయనను మించిన ఆయన రియల్‌ హీరో . అందరికీ అలా ఉండటం సాధ్యం కాదు. ఆహార అలవాట్లు, వ్యాయమ విషయాల్లో క్రమశిక్షణ మనం నిత్యజీవితంలో పాటించలేక పోతున్నాం. కానీ ఆయన మాత్రం అలా కాదు. ఆయనే నాగార్జున. అగ్ర కథానాయకుల్లో యువకుడిలా ఉండే హీరో. 60 ఏళ్లు వచ్చినా ఇటు హీరోయిన్లకు, అటు దర్శక నిర్మాతలకు మాత్రం 30 ఏళ్ల యువకుడి లాగే కనిపిస్తాడు .

‘మా నాన్న పక్కనుంటే మా కంటే ఆయనే కుర్రాడంటారందరూ’ అని నాగార్జున కొడుకులే చెబుతుంటారు. ప్రస్తుతం ఆయన స్పెయిన్‌లో ఉన్నారు. తన తండ్రి మరణం తర్వాత జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నారు. అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా 1986లో పరిచయమైన నాగార్జున ‘విక్రమ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాలో అతని వాచికం, నటనను చూసి ఇండిస్టీలో నిలబడడం కష్టమే అని అనుకున్నారంతా. ఆ తర్వాత స్నేహితులు, ఇండిస్టీ ప్రముఖుల నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌తో తనను తాను నటుడిగా మలచు కోవడానికి చాలా కసరత్తే చేశాడు. నటుడికి ఉండాల్సిన లక్షణాల కోసం నిత్యం వ్యాయామం, స్విమ్మింగ్‌, యోగా చేస్తూ నటుడిగా తగిన పాత్రల ఎంపికతో గుర్తింపు పొందాడు. నటవారసుడిగా అందరూ పట్టం కడతారని మాత్రం అనుకోలేదు. విక్రమ్‌ తర్వాత వచ్చిన ‘కెప్టెన్‌ నాగార్జున’, ‘అరణ్యకాండ’ చిత్రాలు కూడా ఫెయిల్యూర్‌ అయ్యాయి.

అటువంటి సమయంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన విషాద ప్రేమ కథ ‘మజ్ను’ నాగార్జునను నటుడిగా నిలబెట్టింది. ఆ తర్వాత నాగార్జున నమ్మకంతో చేసిన ‘కలెక్టర్‌గారి అబ్బాయి’, ‘కిరాయిదాదా’ చిత్రాలు కొంతమేరకు గట్టెక్కించాయి. 1988లో వచ్చిన ‘ఆఖరి పోరాటం’ కెరీర్‌ పరంగా ఊపునిచ్చింది. కొన్నాళ్ళకు వర్మ దర్శకత్వంలో ‘శివ’, మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రాలు కెరీర్‌ పరంగా వెనక్కు తిరిగి చూడకుండా చేశాయి. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్న ఆయన మరోవైపు వ్యాపార రంగంలోనూ ప్రవేశించారు. కార్పొరేట్‌ బిజినెస్‌మేన్‌ కూడా. ఎం.బి.ఎ. చదివిన ఆయన సినిమా రంగంలోని వ్యాపారంపై దృష్టి పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోతో పాటు టెక్నికల్‌ రంగాలపైనా శ్రద్ధ పెట్టారు. ఆస్తులు, సంపాదన బాగా ఉన్నా ఇంకా ఏదో సాధించాలని పట్టుదలతో ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ వంటివి పెట్టి వందలాది సిబ్బంది జీవనోపాధికి ఆసరాగా నిలిచారు.

ఎంతో కాలంగా తన వద్ద పనిచేసే సిబ్బందికి ఆసరాగా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. టాప్‌ బిజినెస్‌మేన్‌గా పేరు సంపాదించుకున్న ఆయన అన్నపూర్ణ స్టూడియో నిర్వహణ, పలు సామాజిక చైతన్య కార్యక్రమాల్లో నిర్వహణలో ముందుంటారు. టీవీ హోస్ట్‌గా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ప్రస్తుతం ‘బిగ్‌బాస్‌ 3’కు వ్యవహరిస్తున్నారు. అదీ తన స్టూడియోలో నిర్వహించడం విశేషం. ఆమధ్య మా టీవీలోనూ భాగస్వామి కూడా కొనసాగారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నాగార్జున అందించిన న్యూ టాలెంట్‌ను మరే హీరో అందించలేదనే చెబుతారు దర్శక నిర్మాతలు. కొత్త దర్శకులతో పనిచేయడానికి ఆలోచించే రోజుల్లోనే ఆయన తనే నిర్మాతగా మారి వారిని ప్రోత్సహించే సందర్భాలూ చాలానే ఉన్నాయి. మొన్నటి రామ్‌గోపాల్‌ వర్మ నుంచి నిన్నటి కళ్యాణ కృష్ణ కురసాల వరకు దాదాపు 12 మంది దర్శకులకు అవకాశం కల్పించారు.

రిస్క్‌ తీసుకున్న కొన్ని సందర్భాల్లో ఛేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. ఇక నటుడిగా పలు అవార్డులు అందుకున్న ఆయన ఇంట్లో అవార్డుల గ్యాలరీనే ఉంది. నిర్మాతగా 9 ప్రతిష్టాత్మక నంది అవార్డులు అందుకున్న నాగ్‌ ‘నిన్నే పెళ్లాడుతా’, ‘రాజన్న’ చిత్రాల ద్వారా జాతీయ పురస్కారాలు పొందారు. నటుడిగా తనలాగే తన వారసుల్ని ముందుకు తీసుకు రావడమే కాకుండా ఓ నటిని కోడలిగా ఆహ్వానించడం మరో ప్రత్యేకత. తాజాగా ఆయన చేసిన ‘మన్మథుడు 2’ సినిమా ఆశించిన ఫలితాలు రాబట్ట లేక పోయింది. ప్రస్తుతం ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్‌ చేసే పనిలో ఉన్నాడు ఈ 60 ఏళ్ల 30 ఏళ్ల ‘మన్మథుడు’

Copy Protected by Chetan's WP-Copyprotect.