సాహో తర్వాత ప్రభాస్‌ ఫ్యూచర్ ప్లానేంటి?

ఖర్చు పెట్టిన డబ్బులు వచ్చేస్తే వచ్చేసి ఉండవచ్చు గాక. కానీ బాహుబలి లాగా ప్రజల హృదయాలతో మాత్రం “సాహో” అనిపించుకోలేక పోయాడు ప్రభాస్‌. బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ ఫలితంతో మొదలైన సాహోని భారీ చిత్రం కనుక ఫ్లాప్, యవరేజ్ క్యాటగిరీలను పక్కనపడేస్తే.. -హిట్టనాలా? అనకూడదా? అన్న సందిగ్దంలోనే ఉండిపోయారు సినీ పండితులు సైతం. ‘కలెక్షన్లలో వేగం.. ఆడియన్స్‌లో మౌనం’ -ఈ వైరుధ్యమైన అంశాలను ఈక్వేషన్‌లో ఇమడ్చలేక తోచిందేదో చెప్పుకుంటూ వచ్చారు.

సెలవుల తరువాత మంగళవారం నుంచీ వాస్తవిక లెక్కలు వెలుగు చూస్తున్నాయి. సాహో మైకం సంపూర్ణంగా దిగిపోయిందన్న విషయం అర్థమవుతోంది. డిస్ట్రిబ్యూటర్లు సైతం ‘రూపాయి రాక.. పోక’ లెక్కలు వేసుకోవడం మొదలెట్టడంతో -ఈ ఎపిసోడ్ మళ్లీ ప్రభాస్ ముందు పెద్ద క్వొశ్చన్‌గా మారింది. అదే ‘వ్వాట్ నెక్ట్స్’? ఈ ప్రశ్నకు వెతికే సమాధానం -ఇప్పటికే మొదలైన ప్రాజెక్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది మరో కోణం. సాహో షూటింగ్ టైంలోనే ప్రభాస్ కొత్త ప్రాజెక్టు లాంఛనంగా మొదలవ్వడం తెలిసిందే. ఆ ప్రాజెక్టు బాధ్యతలు తీసుకున్న జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఐరోపా కాన్వాస్‌పై 20 రోజుల షూటింగ్ కూడా చేసేశాడు. ప్రాజెక్టులో పూజా హెగ్దె హీరోయిన్. వింటేజ్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకునే కథ, దాని కథనం, నిర్వాహక పరిమితి, ప్రాజెక్టు పరిమాణంలాంటి అంశాలపై సాహో ప్రభావం ఉంటుందా? ఉండదా? అనేదే ఆసక్తికరమైన అంశం.

బాహుబలి -ద కన్‌క్లూజన్ ప్రమోషన్స్ టైంలోనే భారీ చిత్రంతో వత్తిడికి గురవుతున్నా. మళ్లీ ఇలాంటి ప్రాజెక్టు చేయాలంటే కొంత గ్యాప్ కావాల’న్నాడు ప్రభాస్. అయితే ప్రాజెక్టు ఫలితం అనూహ్యం కావడంతో -ఆటోమేటిక్‌గా పెద్ద ప్రాజెక్టువైపే అడుగులేశాడు. సాహో ప్రమోషన్స్ టైంలోనూ ప్రభాస్ నుంచి అదే ఆన్సర్ రిపీటైంది. భారీ చిత్రాలతో అలసిపోయాను. కాస్త విశ్రాంతిగా ఏడాదికి రెండు సినిమాలు చేసే ఆలోచనను ఆచరణలో పెడతా’నన్నాడు. అబ్బురపర్చే పోరాట ఘట్టాలు, అందుకయ్యే భారీ ఖర్చుకంటే.. బలమైన భావోద్వేగాలతో సాగే కథలపైనే దృష్టి పెడతాననీ ఫ్యాన్స్‌కి ప్రామిస్ చేశాడు. సో, ముందే సిద్ధమైన బ్లూప్రింట్ ప్రకారం -కథాపరిమితికి తగినంత భారీతనంతో ‘వింటేజ్ లవ్’ ఫీల్ అందిస్తాడా? లేక మరో ప్రయోగమేమైనా మస్కిష్కంలో రూపుదిద్దుకుంటుందా? అన్నది ప్రభాసే చెప్పాలి. ఎంతటి సాహోకైనా -అలసట, విశ్రాంతి కామన్. సో.. విదేశీ విశ్రాంతి ముగించిన తరువాత ప్రభాస్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తాడో చూద్దాం.

Copy Protected by Chetan's WP-Copyprotect.