విసుగు, విరక్తి పుట్టిస్తున్న బిగ్‌బాస్‌-3 తెలుగు!

శ్రీముఖి ఓవర్‌ యాక్షన్‌, ఆలీ రంకెలు, బాబా భాస్కర్ భరింపశక్యం కాని నస, అతి వాగుడు వెరసి బిగ్‌ బాస్‌ -3 తెలుగు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. చూసే వాళ్లకి విసుగు, విరక్తి తెప్పిస్తున్నాయి. ఫలితంగా రోజురోజుకు బిగ్‌బాస్‌ రేటింగ్‌లు దారుణంగా పడిపోతున్నాయి. పరస్పరం తన్నుకునే టాస్క్‌లు ఇస్తున్న బిగ్‌బాస్‌ పైకి మాత్రం నీతిసూత్రాలు వల్లిస్తూ ఫిజికల్‌ ఎటాక్ వద్దు అని చెప్పటం అసంబద్ధంగా ఉంది. హౌస్‌లో అడుగుపెట్టిన తొలిరోజే శిల్పా చక్రవర్తికి చుక్కలు కనిపించాయి.

ఆడా,మగ టచ్ చేయకూడదు, లాగకూడదు, నెట్టకూడదు అని గతంలో నాగార్జున కూడా నీతులు చెప్పారు రాహూల్‌కి. రాహుల్ హిమజను ఎక్కడ చేయి వేసి నెట్టారో వీడియో మరోసారి ప్లే చేసి చూపించారు. కానీ ఆడామగా దారుణంగా హత్తుకు, వత్తుకు పోయేలాంటి టాస్క్‌లు ఇచ్చిన బిగ్‌బాస్‌ ద్వంద్వ ప్రమాణాలు చాటుతున్నాడు. ఈ వారం టాస్క్ లో భాగంగా దొంగలు దోచిన నగరం అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. రెండు గ్రూపులుగా అందర్నీ విడదీసి.. ఒక గ్రూపు దొంగలు.. రెండో గ్రూప్ ప్రజలు.. దొంగల రాణి శిల్ప. దొంగలు దోచుకోవడానికి ప్రయత్నించాలి.. ప్రజలు కాచుకోవాలి. సింపుల్ గా కనిపిస్తోంది కదూ. కానీ, ఇందులో ఎంత హింసాత్మకంగా ప్రవర్తించొచ్చో అంతగానూ చేశారు హౌస్ మేట్స్. హైడ్ అండ్ సీక్ లాంటి ఆట కాదిది. శారీరకంగా ఒకరితో ఒకరు పెనుగులాడుకోవాల్సిన ఆట. హౌస్ లో ఆడా, మగా తేడా లేకుండా ఒకరిని ఒకరు తోసుకుంటూ.. కొట్టుకుంటూ ..

అదీ రక్తాలు కారేలా.. ఇక ఈ పోటీలో గెలవకపోతే జీవితమే పోతుంది అన్నట్టుగా.. రచ్చ చేశారు హౌస్ మేట్స్.. బిగ్ బాస్ మధ్యలో గంభీరంగా హెచ్చరించినా ఫలితం లేకపోయింది. కాదు.. అటువంటి హింసాత్మక టాస్క్ ఇచ్చినపుడు ఎవరేం చెప్పినా ఫలితం ఉండదు. బిగ్ బాస్ రిఫరీగా తెరవెనుక నుంచి చెబుతున్నాడు కాబట్టి సరిపోయింది.. ఈ దరిద్రపు టాస్క్ లో రిఫరీగా ముందుంటే.. అతనికి కూడా నాలుగు తగిలించి ఈడ్చేసేవారు హౌస్ మేట్స్. మొత్తమ్మీద నాలుగురోజులుగా గాడిలో పడింది అనుకున్న షో ఇప్పుడు చెప్పడానికి వీలులేనంత రచ్చగా మారడం విషాదం. షో నిర్వాహకులు అసలు ఏం ఆశించి వీక్షకుల ఇళ్ళ మధ్యలోకి హింసను ప్రేరేపించే టాస్క్ లు చోప్పిస్తున్నారో దేవుడికే తెలియాలి. రేటింగ్ లు హింసాత్మక కార్యక్రమాలతో రావనే నిజాన్ని ఎంత తొందరగా బిగ్ బాస్ వర్గాలు గుర్తిస్తే అంత మంచిది.

Copy Protected by Chetan's WP-Copyprotect.