1999లో జరిగినట్టు జరిగితే ఏపీ రిజల్ట్స్ ఇలా ఉంటాయి !

ఉమ్మడి రాష్ట్రంలో 1999లో తెలుగుదేశంను దీపం కనెక్షన్లే గట్టెక్కించాయి. 98 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అప్పట్లో జరిగిన రాజకీయ పరిణామాల్లో చంద్రబాబు 1998 – 99లో ప్రధాని వాజ్‌పేయి సహకారంతో దీపం కనెక్షన్లు పెద్ద ఎత్తున మంజూరు చేయించారు. కిరోసిన్‌ కోటాను తగ్గించుకొని ఆ సబ్సిడీని దీపం కనెక్షన్లకు కేటాయించే విధంగా కేంద్రాన్ని ఒప్పించారు. ఏడాది పాటు అప్పట్లో డ్వాక్రా మహిళలకు గ్యాస్‌ సిలెండర్లు అంద జేశారు.

అప్పటివరకు గ్యాస్‌ కనెక్షన్‌ కావాలంటే పట్టణ, నగర ప్రాంతాల్లో కూడా రూ.8 వేలు, రూ.10 వేలు చెల్లించాల్సి వచ్చేది. అది కూడా బినామీ పేరుతో కనెక్షన్‌ ఇచ్చేవారు. దీపం గ్యాస్‌ సిలెండర్లు అమల్లోకి వచ్చిన తరువాత గ్రామీణ, పట్టణ ప్రాంతాలల్లో ఊహించని విధంగా పేదవర్గాలు కూడా గ్యాస్‌ పొయ్యి ఉపయోగించే పరిస్థితి వచ్చింది. అ ఎన్నికల్లో సీఎల్‌పీ నేత డాక్టర్‌ వైఎస్‌ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ హమీ ఇచ్చినా ప్రజల మెప్పు పొందలేకపోయారు. 1999 ఎన్నికలో ఇప్పుడు జరిగిన తరహాలోనే మహిళలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో భారీ అధిక్యతను సొంతం చేసుకుంది. అదే తరహాలో 2019లో పసుపు – కుంకుమ సాయం అందుకున్న మహిళలు ఓట్ల రూపంలో చంద్రబాబుకు పట్టం కడతారని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనడంతో వారే విజయావకాశాలు నిర్ణయించే శక్తిగా మారుతారని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి.

ఎవరికి వారు మహిళల మద్దతు తమకే ఉందని చెప్పుకొంటున్నారు. ఆడపడచులకు పుసుపు – కుంకుమ ఇచ్చామని, డ్వాక్రా రుణాలు రద్దు చేశామని, వారి మద్దతు తమకేనని తెలుగుదేశం నాయకులు పేర్కొంటున్నారు. ఆ కృతజ్ఞత చాటుకోవడానికే రాత్రి పది గంటలైనా వారు క్యూలో నిల్చొని ఓట్లు వేశారని, చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి చేయడానికి వచ్చారని ఆ పార్టీ అభ్యర్థులు వివరిస్తున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు మాత్రం.. ప్రభుత్వ వ్యతిరేకతను చాటడానికే ఎంత రాత్రయినా విసుగు లేకుండా తమ నిర్ణయం ఓటు రూపంలో చెప్పడానికే మహిళలు భారీగా పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చారని పేర్కొంటున్నారు. ఏదేమైనా మహిళల ఆశీర్వాదం ఎవరికి ఉంటే వారిదే అధికారం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అన్ని జిల్లాల లోనూ ఎన్నికల ఫలితాలను మహిళా ఓటర్లు ప్రభావితం చేయనున్నారు. ఎన్నికల పోలింగ్‌లో మహిళా చైతన్యం వెల్లివిరిసింది. ముఖ్యంగా మహిళా ఓటర్లు భారీగానే ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఈ ఫలితాలు అధికార టీడీపీకి సానుకూల ఫలితాలుంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.