చిదంబరంపై అమిత్‌షా పగ హిస్టరీ తెలిస్తే షాక్ అవుతారు!

పదేళ్ల యూపీఏ పాలనలో… చిదంబరం అత్యంత శక్తిమంతమైన నాయకుడు! ఆయన 2008 నవంబరు 29 నుంచి 2012 జూలై 31 వరకు కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు. గుజరాత్‌లో గోద్రా అనంతర అల్లర్లతోపాటు పలు ‘ఎన్‌కౌంటర్ల’కు మోదీని బాధ్యుడిని చేస్తూ కేసులు పెట్టేందుకు చిదంబరం తీవ్ర ప్రయత్నాలు చేశారన్నది బీజేపీ ఆరోపణ! అది కుదరక పోవడంతో మోదీ తర్వాత రాష్ట్రంలో శక్తిమంతుడిగా ఎదిగిన అమిత్‌షాపై చిదంబరం దృష్టి సారించినట్లు చెబుతారు.అప్పట్లో… జరిగిన సోహ్రాబుద్దీన్‌ షేక్‌, ఆయన భార్య కౌసర్‌ బీ, సహాయకుడు తులసీరాం ప్రజాపతి ‘ఎన్‌కౌంటర్‌’లు చిదంబరానికి అస్త్రంగా దొరికాయి. ‘ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌. దీనికి పథకాన్ని రచించింది అమిత్‌ షా’ అంటూ సీబీఐ 2010లో అభియోగాలు మోపింది. డీఐజీ వంజారా, ఎస్పీ రాజ్‌కుమార్‌ పాండ్యన్‌ తదితర పోలీసు అధికారులు ఇందుకు సహకరించారంటూ వారినీ సీబీఐ అరెస్టు చేసింది.

జైలుకు వెళ్లిన పోలీసు అధికారుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ‘అమిత్‌ షా ఆదేశాల మేరకే ఎన్‌కౌంటర్‌ చేశాం’ అని చెప్పలేదు. పైగా… ఈ ఎన్‌కౌంటర్‌పై తొలుత దర్యాప్తు జరిపిన పోలీసు కమిషనర్‌ గీతా జోహ్రీ.. షాను ఈ కేసులో ఇరికించాలని తనపై సీబీఐ ఒత్తిడి తెస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ 2010 జూలై 25న అమిత్‌ షాను ఈ కేసులో అరెస్టు చేశారు. హత్య, బలవంతపు వసూళ్లు, కిడ్నాప్‌ అభియోగాలు మోపారు. స్వయంగా న్యాయవాది అయిన చిదంబరంఈ చార్జిషీటును పరిశీలించి పలు మార్పులు చేర్పులు చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి.‘కేసు పటిష్ఠంగా ఉందో లేదో తెలుసుకోవడానికి చార్జిషీటును పరిశీలించాను’ అని చిదంబరం కూడా అంగీకరించారు. జైలు.. ప్రవాస జీవితం! సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో అరెస్టయిన వెంటనే మంత్రి పదవికి అమిత్‌ షా రాజీనామా చేశారు. ఆయన మూడు నెలలు జైలులో ఉన్నారు. ఆ సమయంలో… ‘మిమ్మల్ని వదిలేస్తాం! ఈ ఎన్‌కౌంటర్ల వెనుక మోదీ ఉన్నారని చెప్పండి’ అంటూ అమిత్‌షాపై అప్పట్లో సీబీఐ ఒత్తిడి తెచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ ఒత్తిళ్లకు షా లొంగలేదు. ఆయనకు బెయిల్‌ రాకుండా సీబీఐ అడ్డుకుంది. బయటకు వస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని పేర్కొంది. చివరకు, 2010 అక్టోబరు 29న గుజరాత్‌ హైకోర్టు ఆయనకు బెయిల్‌ ఇచ్చింది. ఆయన గుజరాత్‌లో ఉంటే దర్యాప్తులో తలదూర్చుతారని సీబీఐ వాదించింది.రెండేళ్లపాటు గుజరాత్‌లో షా అడుగు పెట్టకుండా అప్పట్లో హైకోర్టు జడ్జిగా ఉన్న అఫ్తాబ్‌ ఆలం తీర్పు చెప్పారు. అమిత్‌ షా తన స్వ రాష్ట్రాన్ని విడిచి, ఢిల్లీలోని గుజరాత్‌ భవన్‌లోని ఒక గదిలో రెండేళ్లపాటు ‘ప్రవాస జీవితం’ గడపాల్సి వచ్చింది. చివరికి… కేసు విచారణను ముంబైకి బదిలీ చేస్తూ, గుజరాత్‌లో షా అడుగుపెట్టేందుకు సుప్రీం అనుమతించింది. మారిన సీన్‌… 2014లో బీజేపీ అధికారంలోకి రాగానే చిదంబరానికి కష్టాలు మొదలయ్యాయి. ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో పెట్టుబడుల కేసును దాదాపు ఐదేళ్లుగా సీబీఐ, ఈడీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసుల్లో అరెస్టు కాకుండా ఆయన ఎప్పటికప్పుడు ముందస్తు బెయిల్‌ తెచ్చుకుంటూ వచ్చారు. కుమార్తె హత్య కేసులో జైల్లో ఉన్న ఐఎన్‌ఎక్స్‌ అధినేత పీటర్‌ ముఖర్జీ, ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జీ అప్రూవర్లుగా మారి చిదంబరానికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వడంతో ఉచ్చు బిగుసుకుంది.అప్పుడు… చిదంబరం కేంద్ర హోంమంత్రి! అమిత్‌షా గుజరాత్‌ హోంమంత్రి మాత్రమే! సీబీఐ అధికారులు… అమిత్‌షాను వేటాడారు. అరెస్టు కూడా చేశారు.

కొన్నాళ్లు జైలు జీవితం గడిపిన అమిత్‌ షా… రెండేళ్లపాటు సొంత రాష్ట్రంలో అడుగు పెట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. కాలచక్రం గిర్రున తిరిగింది! ఇప్పుడు… అదే అమిత్‌ షా కేంద్ర హోంమంత్రి అయ్యారు. చిదంబరం ఎంపీ మాత్రమే! సీబీఐ, ఈడీ అధికారులు చిదంబరాన్నివెంటాడుతున్నారు. అప్పుడు కాంగ్రెస్‌ చెప్పింది.. ఇప్పుడు బీజేపీ చెబుతున్నదీ ఒక్కటే! ‘మాది కక్ష సాధింపు కానే కాదు. చట్టం తనపని తాను చేసుకుపోతోంది!’

Copy Protected by Chetan's WP-Copyprotect.