ఆంధ్రాలో కింగ్ ఆయనే! ఢిల్లీలో కింగ్‌ మేకర్‌ ఆయనే!

వాజ్‌పేయిని ప్రధాని పదవిలో కూర్చోబెట్టినా.. దేవెగౌడను ఢిల్లీ పీఠం ఎక్కించినా.. అది దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే చెల్లింది!! ఆంధ్రప్రదేశ్‌లో కింగ్‌ అయిన పార్టీనే.. కేంద్రంలో కింగ్‌మేకర్‌ అవుతోంది. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకున్న పార్టీ.. ఢిల్లీ రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా మారుతోంది. విభజనకు ముందు.. తర్వాతా ఇదే సెంటిమెంట్‌ కొనసాగుతోంది!! 42 లోక్‌సభ స్థానాలున్న ఉమ్మడి ఏపీలో 2004లో కాంగ్రెస్‌ పార్టీ 29 సీట్లు గెలుచుకుంది.

కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ అధికారం చేపట్టింది. ఇక రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ అధికారం దక్కించుకుంది. 2009లోనూ కాంగ్రెస్‌ 33 ఎంపీ సీట్లు సొంతం చేసుకుంది. అప్పుడు కూడా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంది. 2014లో ఉమ్మడి ఏపీ.. నవ్యాంధ్ర, తెలంగాణగా విడిపోయింది. 25 ఎంపీ స్థానాలు, 175 నియోజకవర్గాలతో ఏపీ ఏర్పడింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేశారు. 25 ఎంపీ స్థానాలకు గాను ఎన్డీయే 17 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో టీడీపీ 15 సీట్లు గెలిచింది. వైసీపీకి 8 సీట్లు దక్కాయి. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చకపోవడంతో నాలుగేళ్లపాటు ఎన్డీయే ప్రభుత్వంలో కొనసాగిన టీడీపీ.. కూటమిని వీడింది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే! 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని ఎంపీ సీట్లు గెలిచి కేంద్రంలో మళ్లీ కీలక పాత్ర పోషించేందుకు ఆయన పావులు కదుపుతున్నారు.

మూడోసారి.. నాలుగోసారి.. 1989 నుంచి కూడా.. ఒకసారి అన్నాడీఎంకే పార్టీని గెలిపిస్తే.. మరోసారి డీఎంకేకి అవకాశమిచ్చి చూడ్డం తమిళుల ఆనవాయితీ. అలాంటిది వారే 2011, 2016ల్లో వరుసగా అన్నాడీఎంకేకి పట్టంగట్టారు. తమిళనాట ఇది ఇంత ఆలస్యమైందిగానీ.. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో వరుసగా మూడుసార్లు, నాలుగుసార్లు అధికార పక్షానికి పట్టంగట్టిన సందర్భాలూ ఉన్నాయి. బిహార్‌లో నేరాలు, అవినీతితో అస్తవ్యస్తంగా తయారైన వ్యవస్థను గాడిన పెట్టడంతో.. అక్కడి ప్రజలు జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ను వరుసగా రెండుసార్లు సీఎంగా ఎన్నుకున్నారు. ఢిల్లీలో షీలా దీక్షిత్‌కు అక్కడి ప్రజలు వరుసగా మూడు సార్లు పట్టం కట్టారు. సుపరిపాలన అందించడంతోనే ఆమె 15 ఏళ్లపాటు అధికారంలో ఉన్నారు.
కొత్తగా ఏర్పడిన ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలో రమణ్‌సింగ్‌ను వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిని చేశారు. నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉండే రాష్ట్రంలో ప్రజలకు ఆయన సంక్షేమ ఫలాలు అందించారు. ‘చావల్‌ బాబా’గా పేరు పొందారు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు సచ్ఛీలుడన్న పేరు ఉంది. నిజాయతీగా, పారదర్శకమైన పాలన అందించడంతో ఆ రాష్ట్ర ప్రజలు వరుసగా మూడు సార్లు ఆయనకే జై కొట్టారు. ఒడిసాలో బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌ను అక్కడి ప్రజలు వరుసగా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.