వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బాబు విధించిన డెడ్‌లైన్‌ ఇదే!

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం చంద్ర‌బాబు ఇప్ప‌టి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇటీవ‌ల త‌ర‌చూ జిల్లాల‌కు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల‌తో భేటీ అవ్వ‌డంతో పాటు ఎమ్మెల్యేల ప‌నితీరుపై చేయించిన స‌ర్వేల వివ‌రాల‌ను వాళ్ల‌కు అంద‌జేస్తూ వారిని ఎప్ప‌టిక‌ప్పుడు అలెర్ట్ చేస్తూ వ‌స్తున్నారు.. జిల్లాల్లో పార్టీ పరిస్థితితో పాటు నేతల పనితీరుపై ఆయన వ‌రుస‌గా స‌మీక్షిస్తున్నారు. వివిధ జిల్లాలో పార్టీ నేతలంతా సమన్వయంతో పని చేయడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా విభేదాలు పక్కన పెట్టడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

విభేదాలతో రోడ్డున పడ్డ నేతలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేది లేదని ఆయన ఖ‌రాఖండీగా చెప్పేస్తున్నారు. వ్యతిరేకత బాగా ఉందని సర్వేల్లో తేలిన ఎమ్మెల్యలకు ఇక రెండే నెలలు గడువు. ఈలోపు తమపై పడిన మచ్చను చెరిపేయాలి. వ్యతిరేకతను తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఈలోగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం, ప్రభుత్వ పథకాలు పూర్తి చేయడం, నియోజకవర్గాల వారీగా అధికారులను అప్రమత్తం చేసి లక్ష్యాలను సాధించడం, ప్రజల్లో సంతృప్తి స్థాయిని 80 శాతానికి చేర్చడం వంటి లక్ష్యాలను ప్రభుత్వం ఎంచుకుంది. రాబోయే రెండు నెలల కాలాన్ని అత్యంత కీలకంగా భావిస్తోంది. క్షణం తీరిక లేకుండా ఎక్కడికక్కడ అంచనాలకు తగ్గట్టుగా పనులు పూర్తవుతున్నాయా, పథకాలు ప్రజలకు చేరువ అవుతున్నాయా, ఇంతకు ముందే ఇచ్చిన హామీల్లో ఏమైనా పెండింగ్‌లు ఉన్నాయా అనేదానిపై ప్రభుత్వం ఆరా తీయడం ఆరంభించింది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇప్పటికే భారీఎత్తున హామీలు ఇచ్చి ప్రజల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటున్నారనే విషయాన్ని గుర్తించారు. దీనికి విరుగుడిగా సాధ్యమైనంత మేర వ్యూహాన్ని మార్చి పథకాలందరికీ చేరువయ్యేలా జాగ్రత్తపడాలని భావిస్తున్నారు. దీనికి తగ్గట్టు యంత్రాంగం పనితీరులోనూ మార్పులను ఆశిస్తున్నారు. ఈనెలాఖరు నాటికే అధికారుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. ఇదే సమయంలో అత్యంత కీలక జిల్లాల్లో ఒకటైన పశ్చిమాన అంతర్గతంగా పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే నిర్వహించిన సర్వేల్లో ఫలితాలు ఏ మాత్రం ఆశాజనకంగా లేనట్టు తేలింది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి శాతం అత్యధికంగా కనిపించినా సీఎం చంద్రబాబుపై సానుకూలత చెక్కు చెదరకపోవడాన్ని గుర్తించారు. సమయం దగ్గర పడుతున్నా ఇంకా పట్టనట్టుగా వ్యవహరిస్తున్న కొందరు ఎమ్మెల్యేల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎందుకనంటే జిల్లాలో సరాసరిన ఆరు నుంచి ఏడు వరకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో మార్పులు ఉంటాయని ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. అయినా ఎవరంతట వారు తమ సీటు పదిలమే అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. లోలోన ‘మార్కులు’ తగ్గిన వైనాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు.

ఎన్నికల సమయం దగ్గర పడుతుండగా ఈ రెండు నెలల సమయాన్నే అత్యంత కీలకంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. జిల్లా యంత్రాంగంలో ఈ నెలాఖరు నాటికి మార్పులు, చేర్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. కలెక్టర్‌ భాస్కర్‌ దగ్గర నుంచి మరికొందరు జిల్లాస్థాయి అధికారులకు స్థాన చలనం తప్పకపోవచ్చు. వీరిస్థానంలో మరింతగా పనిచేసే అధికారుల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈలోపే ప్రభుత్వ లక్ష్యాలను అందుకోవడానికి యంత్రాంగంపై అదనపు భారం పెట్టబోతున్నారు. ఇప్పటికే ఇంటింటికీ గ్యాస్‌ పైపులైను, ప్రభుత్వ కుళాయి, రేషన్‌కార్డులు, పింఛన్లు, సొంత ఇళ్లు, ఇంటి స్థలం, రోడ్ల నిర్మాణం, చింతలపూడి ఎత్తిపోతల పథకం, నరసాపురం వద్ద ఫిష్‌ హార్బర్‌, ఆక్వా రైతులకు యూనిట్‌ రెండు రూపాయలకే విద్యుత్‌ సరఫరా, ముంపు మండలాల్లో నిర్వాసితులకు కాలనీల నిర్మాణం, కొల్లేరు కాంటూరు కుదింపు వంటి ప్రాధాన్యత అంశాలపై నేరుగా దృష్టి పెట్టబోతున్నారు. వీటి పురోగతిని సమీక్షించాలని నిర్ణయించారు.  ఎక్కడైనా వెనుకబడితే అధికారుల సహకారంతో పురోగతి సాధించాలని నిర్ణయించారు. రేషన్‌ కార్డులు, పింఛన్ల విషయంలో అడిగిన వారికి కాదన కుండా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నియోజకవర్గాల వారీగా పార్టీ, ప్రభుత్వ పథకాల తీరుపై ఒక అంచనాకు వచ్చేందుకు అంతర్గత నివేదికలు ప్రభుత్వం చేతికి అందాయి. లోటుపాట్లపై నివేదికలో స్పష్టంగా ఉన్నట్టు సమాచారం. దీని ప్రకారమే దాదాపు అర డజను నియోజకవర్గాల్లో ప్రజల సంతృప్తి ఆశాజనకంగా లేదనే విషయం తేలింది. ఇదే తరుణంలో సమస్యలను పరిష్కరించగలిగితే తిరిగి ప్రజామోదం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు ఒక అంచనాకు వచ్చారు. పార్టీపరంగా ఉన్న అసంతృప్తివాదులను గుర్తించి ఆ మేరకు ముందస్తుగా జాగ్రత్తపడాలనే ఆలోచన వ్యక్తమవుతోంది. దీనికి తగ్గట్టుగానే వైసీపీ, బీజేపీ, జనసేన కదలికలపై పూర్తిగా దృష్టి సారించి ఆ పార్టీ వ్యూహాలను తల్లకిందులు చేసే విధంగా కొత్త వ్యూహాలు సిద్ధం కావాలని ఆలోచనకు పదును పెట్టబోతున్నారు. మంత్రులు జవహర్‌, పితాని సత్యనారాయణలకు తాజాగా మరికొన్ని బాధ్యతలను అప్పగిస్తారని సమాచారం. ఈ ఇద్దరు మంత్రులు నియోజకవర్గాలకే పరిమితం కాకుండా జిల్లాలో చురుకైన పాత్ర పోషించేలా బాధ్యలు ఉండబోతున్నాయని ఒక అంచనా.

Copy Protected by Chetan's WP-Copyprotect.