భీమిలీ నుంచి సబ్బంహరి! రేపు భారీ ర్యాలీగా నామినేషన్‌!

మాజీ ఎంపీ సబ్బంహరికి టీడీపీ భీమిలీ సీటు ప్రకటించింది. రేపు ఆయన తన అభిమానులు, అనుచరులతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించిన నామినేషన్ వేస్తారని తెలిసింది. నేడు ఆయన సీఎంను కలిసి లాంఛనంగా తెలుగుదేశంలో చేరతారు. రాజకీయ నాయకుడుగా గాక విశ్లేషకుడి తరహాలో మాట్లాడ్డం ఆయనకు అలవాటు. ఆయనకు ప్రజల్లో మంచి ఇమేజ్‌ ఉంది. అవతలివారిని గౌరవిస్తూ వివాదాస్పదంగా గాక వివరణాత్మకంగా తను చెప్పాలనుకున్నది చెబుతున్నట్టు కనిపిస్తారు. కాని గట్టి అభిప్రాయాలున్న వ్యక్తి. సబ్బం హరి..

కాంగ్రెస్‌ ఎంపిగా తర్వాత జగన్‌కు సన్నిహితుడుగా ఆపైన దూరమైన నేస్తంగా వివిధ దశలో టీవీ చర్చల్లో పాల్గొనే వారు. ఆయన తనకి ఉండే సోర్సులు, తనకి ఉండే అంచనాలను అప్పడప్పుడు వెలువరుస్తూంటారు. వాటికి తగిన లాజిక్ కూడా ఉంటుంది. ఇటీవల విశాఖ రివ్యూ మీటింగ్‌కు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ ఎంపీ సబ్బంహరితో మాట్లాడినట్టు సమాచారం. మొదట సబ్బం హరి పేరును సీఎం విశాఖ ఎంపీ సీటుకు పరిశీలన చేశారు. అయితే తాను లోగడ ఎంపీగా పోటీ చేసినందున ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిని అవ్వాలనేది తన కోరిక అని సబ్బంహరి సీఎంను రిక్వెస్ట్ చేసినట్టు తెలిసింది. మీ వీలును బట్టి ఎలా అయినా నాకు అభ్యంతరం లేదు. నా ప్రయారిటీ మాత్రం ఇది. పార్టీ అధినేతగా మీరు ఎక్కడి నుంచి పోటీ చేయమని చెప్పినా నేను రెడీగానే ఉన్నాను అని సీఎంతో సబ్బంహరి చెప్పినట్టు ఆయన దగ్గరి వ్యక్తులు చెప్పారు.నిన్న రాత్రి తుది విడత జాబితాలో భాగంగా ఆయనకు భీమిలీ కేటాయించారు. సబ్బం హరికి సంచలన నేతగా పేరుంది. ఆయనకు టికెట్ ఇస్తే మిగతా వారు ఎవరూ పెద్దగా అభ్యంతరం పెట్టరు అనే భావన కూడా ఉంది.ఉన్న వారిలో ఎవరికి ఇచ్చినా సమస్యే అందుకే మధ్యేమార్గం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికలకు ముందు జ‌గ‌న్‌తో విభేదాల కార‌ణంగా పార్టీ నుంచి బ‌య‌టికి వచ్చి 2014 సార్వత్రిక ఎన్నిక‌ల‌కు రెండురోజుల ముందు విశాఖ‌లో వైసీపీపై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించి వైఎస్ విజ‌య‌మ్మ ఓట‌మికి కార‌కుల‌య్యారు.

రాష్ట్రానికి ఉపయోగపడే ప్రభుత్వానికి ఆవగింజ అంతైనా సాయం చేస్తానని, పార్టీల్లో లేకపోతే బయటి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని మాజీ ఎంపీ సబ్బంహరి తెలిపారు. నవ్యాంధ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూ, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న చంద్రబాబే రాష్ట్రానికి పెద్ద దిక్కని ఆయన ఇటీవల పలుసార్లు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.