మే నెలాఖరున చంద్రబాబు ప్రమాణ స్వీకారం?

మే నెలాఖరున సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. తెలుగుదేశం ప్రభంజనంకు ప్రతిపక్షాలు అడ్రస్ గల్లంతే అని అంచనా వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓట్లు వేసేందుకు మహిళలు ప్రభంజనంలా తరలి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు నారీమణులు పోటీ పడ్డారు. లక్షలాది మంది మహిళలు ఉదయం 7 గంటలకే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి కొన్ని చోట్ల అర్థరాత్రి వరకు వేచి చూసి వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాష్ట్రంలో టీడీపీ గెలుపు ఖాయమని, ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. చెన్నేకొత్తపల్లిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పరిటాల అభిమానులతో ఆమె సమావేశం నిర్వహించారు. పోలింగ్‌ సందర్భంగా మండలంలో టీడీపీ శ్రేణులు మొక్కవోని ధైర్యంతో కలిసికట్టుగా పనిచేశారంటూ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కుట్రలు, కుతంత్రాలకు వైసీపీ తెరలేపి దౌర్జన్యాలు చేసినప్పటికీ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ధైర్యంగా ముందుకు వచ్చి టీడీపీకి ఓట్లు వేశారన్నారు. ఈ ఎన్నికల్లో రాప్తాడులో పరిటాల శ్రీరామ్‌ గెలుపు తథ్యమని, ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటారన్నారు. రాప్తాడులో తమదే గెలుపని వైసీపీ నాయకులు చెప్పుకొంటున్నారని, ఎవరెన్ని చెప్పినా విజయం టీడీపీదేనని పార్టీ శ్రేణులకు ఆమె ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన సంక్షేమపథకాలు, అభివృద్ధితోనే పార్టీ గెలుపు ఖాయమైందన్నారు.

రాప్తాడులో తమ ఓటమి ఖాయమని తెలుసుకుని వైసీపీ నాయకులు పోలింగ్‌ కేంద్రాల్లో భయోత్పాత వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించారన్నారు. వారెన్ని కుట్రలు చేసినా శ్రీరామ్‌ గెలుపు ఆపలేరన్నారు. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వాన్ని ప్రజలు మరోసారి కోరుకున్నారని, అందువల్లనే పెద్దఎత్తున పట్టుదలతో ఓటింగ్‌లో పాల్గొన్నారన్నారు. వైసీపీతో కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమ్మక్కై కుట్రలకు తెరలేపి సీఎం చంద్రబాబును ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టాలని చూశారన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌ కూడా విఫలమయిందని, పోలింగ్‌ నిర్వహణలో అడుగడుగునా అడ్డంకులు సృష్టించారన్నారు. ఈ ఎన్నికల్లో ఏదోవిధంగా గొడవలు సృష్టించి పరిస్థితిని తమకు అనుకూలంగా చేసుకోవాలని వైసీపీ ప్రయత్నించిందని, అయితే ప్రజలు వారికి తగినవిధంగా బుద్ధి చెప్పారన్నారు. టీడీపీ శ్రేణులే కాకుండా ప్రజలు కూడా మళ్లీ చంద్రన్న రావాలని భావించి రాత్రి ఒంటి గంట దాటుతున్నా ఓట్లు వేయడానికి క్యూలో నిల్చున్నారన్నారు. గెలుపుపై వైసీపీ అధినేత జగన్‌, ప్రకా్‌షరెడ్డి పగటి కలలు కంటున్నారని, ఓటు రూపంలో ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.