ఎన్నికల నిర్వహణ ఇంత అనుమానాస్పదమా?!

వీవీప్యాట్‌ స్లిప్పుల్లో 50 శాతం లెక్కించాల్సిందేనని తాము డిమాండ్‌ చేస్తుంటే.. శరీరంలో ఒక చోట నుంచే బ్లడ్‌ శాంపిల్‌ తీసి పరీక్షిస్తారంటూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా వ్యాఖ్యానించడమేమిటంటూ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. బ్లడ్‌ శాంపిల్‌తో పోల్చడం దారుణమని, ఇటువంటి అంశాలతో ఈసీ విశ్వాసం కోల్పోతుందని, ఇది కేన్సర్‌లా మారి, డయాలసిస్‌ స్థాయికి చేరుకుంటుందని హెచ్చరించారు. అసలు 50 శాతం స్లిప్పులను లెక్కించడానికి ఉన్న ఇబ్బందేమిటో ఈసీ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సోమవారం కర్ణాటకలో జేడీఎస్‌ తరపున ప్రచారం చేసిన ఆయన.. మంగళవారం చెన్నై వెళ్లి డీఎంకే కూటమికి సంఘీభావం తెలియజేశారు. డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో జరిగిన విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభ అభ్యర్థులు దయానిధి మారన్‌, కళానిధి వీరాస్వామి, తమిళచ్చి తంగపాండియన్‌, డీఎంకే నేతలు ఆర్‌ఎస్‌ భారతి, టీకేఎస్‌ ఇళంగోవన్‌, మాజీ మంత్రి ఆర్కాడ్‌ వీరాస్వామి, ఆంధ్ర వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో విజయం మాదే. అందులో సందేహమే లేదు. అయినా సరే.. ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఎన్నికల్లో పారదర్శకత కోసమే పోరాడుతున్నాను. ఇది ప్రజల విశ్వాసానికి సంబంధించిన విషయం. కౌంటింగ్‌ తర్వాత కూడా ఈవీఎంల్లో లోపాలపై పోరాటం చేస్తాను’ అని సీఎం పేర్కొన్నారు. ఈ నెల 11న జరిగిన ఆంధ్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఈసీ వైఫల్యాన్ని, ఈవీఎంలలో లోపాలను ఎత్తిచూపారు. ఈవీఎంలు సక్రమంగా పనిచేయలేదని, ఓట్లు కూడా తారుమారయ్యాయని ఆరోపించారు. ఈసీ ఘోరంగా విఫలమైందని, మరుసటి రోజు తెల్లవారుజాము వరకు పోలింగ్‌ జరపడం చరిత్రలో ఎక్కడా లేదని, ఓటర్లు చాలా ఇబ్బందిపడ్డారని తెలిపారు. చెన్నై, బెంగళూరు, ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి తెలుగు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓట్లు వేశారని, వారందరి విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈసీపై లేదా అని ప్రశ్నించారు. వీవీప్యాట్‌లో 7 సెకన్ల డిస్‌ప్లే 3 సెకన్లకు తగ్గిపోయిందని, ఎందుకిలా జరిగిందో కమిషన్‌ వివరణ ఇవ్వలేదన్నారు. 50 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు కోరుతూ.. సుప్రీంకోర్టులో కొత్త పిటిషన్‌ వేయబోతున్నట్లు తెలిపారు. సాంకేతిక వినియోగంలో అగ్రగామి దేశాలైన జర్మనీ, నెదర్లాండ్స్‌, ఐర్లాండ్‌ తదితర దేశాలు కూడా ఈవీఎంలను పక్కన పెట్టేశాయని చెప్పారు. మన దేశంలో ఈవీఎంలపై ఎటువంటి ఆడిటింగ్‌ లేదని.. ఎవరు తయారుచేస్తున్నారో, ఎవరు పరీక్షిస్తున్నారో స్పష్టమైన సమాచారం లేదన్నారు. ఈసీ, ఐటీలను దుర్వినియోగం చేస్తూ డీఎంకే, టీడీపీ, జేడీఎస్‌ నేతలపై ఐటీ దాడులు జరుపుతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు దాడులు జరగడం లేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, మోదీ దేశాన్ని సర్వనాశనం చేశారని, ప్రజలను వంచించారని ధ్వజమెత్తారు. ప్రచార సభల్లో విపక్షాలపై ఆరోపణలు చేయడం తప్ప.. ఎప్పుడూ విలేకరుల సమావేశాలు పెట్టలేదని ఎద్దేవాచేశారు.

అన్నదమ్ములుగా కలిసిమెలిసి.. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమికి విజయం చేకూర్చాలని తమిళులు, ఇక్కడ స్థిరపడిన తెలుగు ప్రజలను చంద్రబాబు కోరారు. తమిళనాడులో తెలుగు, తమిళ ప్రజలు అన్నదమ్ములుగా కలిసిమెలిసి జీవిస్తున్నారని, తమిళం అందమైన భాష.. తమిళ సంస్కృతి చాలా గొప్పదని కొనియాడారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను సీఎంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారని, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులోనూ కీలకపాత్ర పోషించబోతున్నారని చెప్పారు. కరుణానిధి తరహాలో స్టాలిన్‌ సమర్థ పాలన అందిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఇదే అంశంపై టీడీపీ మంత్రులు, సీనియర్లు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో ఇప్పటివరకు ఇంత అనుమానాస్పదరీతిలో ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖామంత్రి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఓటరు హక్కును కాలరాశారని మండిపడ్డారు. వివిప్యాట్ స్లిప్‌లు 50శాతం లెక్కించి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. తాను ఆరు ఎన్నికల్లో పోటీ చేశానని, ఇంత చెత్త ఎన్నికలను నా అనుభవంలో ఎప్పుడు చూడలేదన్నారు. అయితే ఈ వి యంలు పనిచేయకపోయినా, అర్థరాత్రి వరకు ఓటర్లు ఎంతో సహనంతో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, వారందరికి చేతులెత్తి ప్రణామం చేస్తున్నానన్నారు. అయితే ఈ వి యంలు మొరాయించడంతో మరెంతోమంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పొరుగు రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉంటూ ఆంధ్రరాష్ట్రంలో ఓటుహక్కు ఉన్నవారంతా వచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారన్నారు. ఈ రాష్ట్రంలో తొలివిడత ఎన్నికలు జరగడంతో ఈవియంలలో ఉన్న ఇబ్బందులను తమ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల కమిషన్ ముందుకు తీసుకెళ్లారన్నారు. ఈ క్రమంలోనే వివి ప్యాట్‌లలోని 50శాతం ఓట్లు లెక్కించాలని డిమాండ్ చేస్తున్నా, న్యాయస్థానం ఆదేశించినా ఎన్నికల కమిషన్ నుండి మాత్రం స్పందన కనపడకపోవడం వెనుక మరిన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. ఓటరు ఈవియంలలో ఓట్లు వేసిన తరువాత తాను ఎవరికి ఓటు వేశానో తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన వివిప్యాట్‌లలో ఏడు సెకన్లు ఓటు వేసిన వారి పేరు, గుర్తు కనిపించాలన్నారు. అయితే కేవలం మూడు సెకన్లు మాత్రమే కనిపించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నారు. పథకం ప్రకారం ఇవిఎంలు పనిచేయకపోవడం, ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసే కుట్ర జరిగిందన్నారు. పోలీసుల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉండడంతో, పోలింగ్ బూత్‌ల వద్ద అల్లర్లు జరిగాయన్నారు. ఆంధ్రరాష్ట్రంలో ఓట్ల తొలగింపు కూడా బీహార్ నుండి జరిగాయన్నారు. అది ఎలా జరిగాయని ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ నుండి సమాధానం లేదన్నారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.