మోదీ మళ్లీ ప్రధాని అయితే! పీఎంవోకు గుడ్‌బై? రాయిటర్స్ సంచలన కథనం

ఈ ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ విజయం సాధిస్తుందా? నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారా? అయితే, మన పరిస్థితి ఏమిటి? ఆయన కింద మళ్లీ పని చేయగలమా? స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని దుస్థితిని మరో ఐదేళ్లు భరించగలమా?… ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అధికారుల్లో రగులుతున్న అంతర్మథనమిది! ఈ పరిస్థితిపై ‘రాయిటర్స్‌’ వార్తా సంస్థ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. దీని ప్రకారం… మోదీ మళ్లీ ప్రధాని అయితే పీఎంవోలో భారీ మార్పులు తప్పవు.

నేరుగా ప్రధాని పర్యవేక్షణలో ఉన్న… అత్యంత శక్తిమంతమైన పీఎంవోలో ప్రస్తుతం 25 మంది వరకూ సీనియర్‌ ఐఏఎస్‌లు ఉన్నారు. మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే, వీరిలో కనీసం 8 మంది పీఎంవోను వదిలి పెట్టాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా ఇతర విభాగాల్లోకి మారాలని, లేదా తమ సొంత కేడర్‌ రాష్ట్రాలకు వెళ్లిపోవాలని, ఇవేవీ కుదరకపోతే స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) తీసుకోవాలని భావిస్తున్నారు. ‘‘రాష్ట్రాల రాజధానులకు లేదా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకోవాలని చూస్తున్నాం. పీఎంవోలో మాత్రమే కాదు… హోం, విదేశాంగ శాఖ తదితర మంత్రిత్వ శాఖల్లో పని చేస్తున్న చాలామంది అధికారులు కూడా బదిలీ చేయించుకోవాలని భావిస్తున్నారు’’ అని తెలిపారు. మోదీ పాలనలో ఉన్నతాధికారుల పాత్ర నామమాత్రంగా మారింది. ఎలాంటి నిర్ణయమైనా సరే… ప్రధాని మోదీతోపాటు కొద్దిమంది మంత్రులు, సలహాదారుల బృందమే తీసుకుంటోంది. వాళ్లు చెప్పింది చేయడం మినహా… సొంత ఆలోచనలకు చోటు ఉండదు. ఉన్నతాధికారులు ఏవైనా సలహాలు, సూచనలు ఇచ్చినా పట్టించుకోరు.నిర్మాణాత్మకమైన విమర్శలనూ ప్రభుత్వం సహించడం లేదు. దీంతో తమ పరిస్థితి సాధారణ క్లర్కుల్లా మారిందని, ‘ఎస్‌ బాస్‌’ అనక తప్పడంలేదని ఉన్నతాధికారులు వాపోతున్నారు. ‘పాలనలో ఉన్నతాధికారుల భాగస్వామ్యం మిస్‌ అయ్యింది. మోదీ, ఆయన మంత్రులకు, ఉన్నతాధికారులకు మధ్య సహజ సిద్ధమైన బంధం లేదు’’ అని హోం శాఖలోని ఓ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. విధేయులుగా వచ్చినా… వరుసగా రెండోసారి అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అధికారుల మార్పిడి సహజంగా జరిగేదే. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ధోరణి కనిపిస్తుంటుంది. కానీ, పీఎంవోలోని అధికారులను మోదీ ఏరికోరి తెచ్చుకున్నారు. తనకు విధేయులుగా, నమ్మకస్తులుగా భావించిన వారినే ఎంచుకున్నారు. అలాంటి అధికారులే ఇప్పుడు ‘మార్పు’ కోరుతుండటం గమనార్హం. ఇష్టంలేనప్పటికీ, నైతికంగా సరికాదని తెలిసినప్పటికీ పైనుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయాల్సి రావడం వీరిని ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, మోదీ హయాంలో ఉన్నతాధికారులు విపరీతమైన పని ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. తరచూ సెలవు దినాల్లో కూడా పని చేయాల్సి వస్తోంది.

ఎవరి పని ప్రదేశాలను వాళ్లే శుభ్రం చేసుకోవాలని మోదీ కొత్త విధానం ప్రవేశపెట్టారు. ఇక… ప్రతి ఒక్కరూ ఆస్తుల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ఇలాంటి అంశాలు ఉన్నతాధికారులకు, ప్రధానికీ మధ్య అంతరాన్ని పెంచాయి. నచ్చని ‘విధానాలు’. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు ఐదువేల మంది ఉన్నతాధికారులు పని చేస్తున్నారు. వీరిలో అత్యధికులు దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన, ఆధునిక భావాలు కలిగిన వారు. అధికార పార్టీ ‘హిందూ జాతీయవాదం’, పాలనలో మోదీ దురుసు వ్యవహారశైలి వారికి మింగుడు పడడం లేదు. దీనికితోడు, పాలనలో ఆరెస్సెస్‌ జోక్యం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఏడాది డిసెంబరులో ఆర్బీఐ గవర్నర్‌ను తప్పించి ఆయన స్థానంలో మోదీకి వీర విధేయుడుగా ఉండే వ్యక్తిని నియమించడంలో ఆరెస్సెస్‌ జోక్యం ఉందని వీరు భావిస్తున్నారు. అలాగే, కొన్ని వివాదాస్పద విధానాలను అమలు చేయడానికి శిక్షణ పొందిన నిపుణులను నియమించాలని ఆరెస్సెస్‌ ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోందని పేర్కొన్నాయి. ‘‘ఆర్థికాభివృద్ధికి నిపుణుల పాలన కావాలి. అందుకు సాధారణ అధికారులపై ఆధారపడలేం’’ అని ఆరెస్సెస్‌ ఆర్థిక విభాగమైన స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ కో కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ గతంలో వ్యాఖ్యానించడాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈ సూచన మేరకు… జాయింట్‌ సెక్రటరీల స్థాయిలో కనీసం పదిమంది నిపుణులను ప్రైవేటు రంగం నుంచి నియమించాలని గత ఏడాది మోదీ ప్రయత్నించారు. కానీ, సివిల్‌ సర్వెంట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారని… మళ్లీ అధికారంలోకి వస్తే, దూకుడుగా ఆ నిర్ణయాన్ని అమలు చేస్తారని అధికారులు భావిస్తున్నారు. ‘‘పెద్ద నోట్ల రద్దు, హడావుడిగా జీఎస్టీ అమలు వంటివన్నీ రాజకీయ నిర్ణయాలే! వాటిపై అధికారుల స్థాయిలో తగిన రీతిలో సంప్రదింపులు జరపలేదు. ఈ రెండు నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయి’’ అని ఒక అధికారి తెలిపారు. పీఎంవోలో, ఇతర అధికార వ్యవస్థలో నెలకొన్న పరిస్థితిపై స్పందించాలని ‘రాయిటర్స్‌’ సంస్థ బీజేపీ అధికార ప్రతినిధి సంజయ్‌ మయూఖ్‌ను కోరగా… ‘‘ఇది పార్టీకి సంబంధించిన అంశం కాదు. దీనిపై స్పందించలేను’’ అని తెలిపారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.