పౌరుషం లేని పవన్ లోకేష్ సవాళ్లకు పత్తా లేడు!

గనులు తవ్వి ఎలుకను పట్టినట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు ఉందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లాలో బాక్సైట్‌ను తవ్వేశారని, ఈ లీజులపై సమగ్ర విచారణ జరిపించాలని పవన్‌కళ్యాణ్ సోషల్ మీడియాలో డిమాండ్ చేసిన నేపథ్యంలో దీనిపై మంత్రి లోకేష్ మంగళవారం ట్టిట్టర్ వేదికగా స్పందించారు. వంతాడ గ్రామంలో ఒక జర్నలిస్టులా పవన్ కళ్యాణ్ ఫేస్ బుక్‌లో లైవ్‌లో లాటరైటు గనుల స్థితిగతులను వివరించారని తెలిపారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వంతాడ గనిలో 100 లారీలు తిరిగేవని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత 200 లారీలు తిరుగుతున్నట్లు పవన్ ఆరోపించారన్నారు. అసలు విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ అక్కడ తిరుగుతున్నప్పుడు ఒక్క లారీ కూడా కనబడలేదన్నారు. అదేమంటే తాను వస్తున్నానని తెలిసి మైనింగ్ ఆపేసి, విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు పవన్‌కళ్యాణ్ ఆరోపించారన్నారు. ఆ విషయం అలా ఉంచితే ముఖ్యమంత్రిని, తనను ప్రస్తావిస్తూ ఇవిగో ఆధారాలు అంటూ వంతాడ గనుల లీజులోని అక్రమాల మీద తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ తయారు చేసిన 18 పేజీల నివేదికను సోమవారం సోషల్ మీడియాలో పవన్ జత చేసినట్లు తెలిపారు. అసలు ఈ గనులను లీజును 2004, 2005, 2007లో ఇచ్చినట్లు స్పష్టంగా ఉందన్నారు. వీటితో పాటు పవన్‌కళ్యాణ్ జత చేసిన మరో రిపోర్టులో 2010లో మరో లీజు ఇచ్చినట్లుగా ఉందన్నారు.

ఆ సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం లేదు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు లేరు.. మంత్రిగా తాను కూడా లేని సందర్భంలో మేము ఎలా బాధ్యులమవుతామో పవన్‌కళ్యాణ్‌కే తెలియాలన్నారు. వంతాడ గనుల గురించి 2010 వరకే తెలుసుకుని ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్‌కు తెలియని ఇంకో విషయం ఇందులో ఉందన్నారు. సెప్టెంబర్ 2012 లోనే నాటి పరిశ్రమలు, వాణిజ్య (విజిలెన్స్) శాఖ అక్రమాలకు పాల్పడిన అధికారులపై కామన్ ప్రొసిడింగ్స్‌కు ఆదేశిస్తూ జీవో ఆర్ టి 631ని జారీ చేసిందని గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత వీటన్నిటినీ ఆధారం చేసుకుని లీజును రద్దు చేసిందన్నారు. పరిశ్రమలు, వాణిజ్య (విజిలెన్స్) శాఖ 2015 డిసెంబర్‌లో జారీ చేసిన జీవో నెంబర్ 121ని చూస్తే ఇదే విషయం తెలుస్తుందని చెబుతూ జీవో వివరాలను లోకేష్ ట్టిట్టర్‌లో జత చేశారు. ఒక పార్టీకి బాధ్యత గల ప్రతినిధిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తించడం తగదన్నారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.