పోలవరం దాదాపు పూర్తి అయ్యే దశలో ఆగటం రాష్ట్రానికి తీరని నష్టం!

పోలవరం దాదాపు పూర్తి అయ్యే దశలో 70 శాతం పైగా అయిపోయిన తరుణంలో ఉన్నట్టుంది కీలక సమయంలో ఇలా ఆగటం రాష్ట్రానికి తీరని నష్టం అని మాజీ జలవనరుల మంత్రి దేవినేని ఉమ అభిప్రాయ పడ్డారు. “1,397 మీటర్ల పొడవైన డయాఫ్రం వాల్ 100 శాతం పూర్తి అయింది. ఎగువ కాఫర్ డ్యామ్ కోసం 2050మీటర్ల పొడవైన జెట్ గ్రౌటింగ్ కటాఫ్ 100 శాతం పూర్తి అయింది. దిగువ కాఫర్ డ్యామ్ 1417 మీటర్ల పొడవైన జెట్ గ్రౌటింగ్ కటాఫ్ కూడా పూర్తి అయింది.

36.79 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు గాను 30 లక్షల క్యూబిక్ మీటర్లు పూర్తి అయ్యాయి. 111.59 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనికిగాను 928 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు జరిగాయి. దేశంలో నిర్మాణం అవుతున్న చిట్ట చివరి అతి పెద్ద జాతీయ ప్రాజెక్టు ఇది. కేంద్రం ప్రకటించిన మొత్తం 16జాతీయ ప్రాజెక్టులలో శరవేగంగా పూర్తవుతోంది కూడా ఈ ఒక్క ప్రాజెక్టే. అటువంటి ప్రాజెక్టును స్వార్థ ప్రయోజనాల కోసం, కక్ష సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిలిపి వేసింది. మొన్నటి వరకు పునాదులు కూడా పడలేదని జగన్ ఎగతాళి చేసిన పోలవరం స్పిల్‌వే లో ఉండే రివర్స్ స్లూయిజ్ గేట్ల ద్వారా 10లక్షల క్యూసెక్కుల వరద నీటిని మళ్లించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే. చారిత్రక కాలంలో రాజులు, గత పాలకుల స్మృతులు, చిహ్నాలు కనపడకుండా ధ్వంసం చేసేవారట. ఆ విధంగానే చంద్రబాబు 70శాతం పూర్తిచేసిన పోలవరాన్ని జగన్‌ నిర్దాక్షిణ్యంగా నిలిపి వేశారు.

బహుళ ప్రయోజనాలు అందించనున్న ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం దశాబ్దాలుగా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నది. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఒక్క అంశంలోనూ ప్రజాస్వామిక దృక్పథం జగన్ పాలనలో కనపడటంలేదు. కక్ష సాధింపు పరాకాష్ఠకు చేరింది. ప్రజాస్వామిక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అన్న సంగతి మర్చిపోయి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. పోలవరం ఫ్యాక్షన్ పడగ నీడలో చిక్కుకున్నది. అవినీతి జరిగిందని రీటెండర్స్ పేరుతో పోలవరం పనులు నిలిపివేయాలని నవయుగ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీచేయడం దారుణం. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం బాధాకరం అని, ఇక ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేం, పైగా వ్యయం కూడా భారీగా పెరుగుతుందని కేంద్ర జలశక్తి మంత్రి వెల్లడించారు. దీంతో పోలవరం భవిష్యత్తు మరోసారి ప్రశ్నార్ధకమైనదని చెప్పుకోవాలి” అని దేవినేని అభిప్రాయ పడ్డారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.