పోలవరం ప్రాజెక్టుపై దేవినేని బయట పెట్టిన మేటర్ ఇదే!

పోలవరం ప్రాజెక్టు శరవేగంగా నిర్మాణం అవటం వెనుక కీలక వ్యక్తి గత ప్రభుత్వంలో ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమా మహేశ్వరరావు. ఆయన ఇటీవల ఆంధ్రజ్యోతికి పత్రికకు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలు ఇవే అంటూ రాసిన వ్యాసంలో అనేక విషయాలు బయట పెట్టారు. “పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖ్యాతి గత ప్రభుత్వానికి దక్కకూడదన్న దురుద్దేశంతో ప్రజాప్రయోజనాలకు తూట్లు పొడవాలని చూడటం క్షమించరాని నేరం. పోలవరంలో అవినీతి జరిగిందని నిజాలకు నిలువు పాతరేసి, అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు.చారిత్రక కాలంలో రాజులు, గత పాలకుల స్మృతులు, చిహ్నాలు కనపడకుండా ధ్వంసం చేసేవారట.ఆ విధంగానే చంద్రబాబు 70శాతం పూర్తిచేసిన పోలవరాన్ని జగన్‌ నిర్దాక్షిణ్యంగా నిలిపి వేశారు. ఆవేశం తప్ప ఆలోచన లేదు.

ఏం చేయాలన్న దాని పైన స్పష్టత లేదు. తాను ఏది చెబితే అది, ఏది అనుకొంటే అది జరిగి తీరాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి మంకు పట్టు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ వెలుగురేఖ, జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తిరోగమన బాట పట్టింది.దశాబ్దాల పోలవరం స్వప్నం సాకారం కాబోతుందని, నవ్యాంధ్ర భవిత మహోజ్వలం కానుందని సంబరపడిన ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలు ఆవిరయ్యాయి. స్వాతంత్ర్యం రాకముందు నుంచి, కాటన్ కాలం నుంచి ఆలోచనలో వున్న పోలవరం ప్రాజెక్టు 2014 తరువాత నిజ రూపందాల్చి కళ్ళముందు ఆవిష్కృతం అయింది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కి పోలవరం ఒక వరం అయింది.జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 100 శాతం విధులు ఇచ్చి పూర్తి చేస్తామని విభజన చట్టంలో హామీ దక్కడంతో పోలవరం ప్రాజెక్టు పురోగమన బాట పట్టింది. దేశ ధాన్యాగారానికి ఎంతో తోడ్పాటు అందించగలిగిన ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోను నిర్దిష్ట సమయానికి పూర్తి చేయాలనే పవిత్ర సంకల్పంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పనులు కొనసాగించింది గత ప్రభుత్వం. 2014 డిసెంబర్ వరకు పోలవరం ప్రాజెక్టు ప్రాంతం అంతా పెద్ద, పెద్ద కొండలు, ఊళ్ళు ఉన్నాయి. ఆ భారీ కొండలను ఎప్పుడు తొలగించాలి? ఆ ఊళ్లను ఎప్పుడు ఖాళీ చెయ్యాలి? ఈ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభించాలి? ఎప్పటికి పూర్తి చేయాలి? ఇది అవుతుందా? అని అందరూ నిరుత్సాహంగా ప్రశ్నించుకుంటున్న వేళ సవాళ్లను అధిగమించి ప్రాజెక్టు ప్రాంతంలో 2019 ఫిబ్రవరి నాటికి మహాద్భుతం ఆవిష్కృతం అయింది.2015 వరకు తట్ట మట్టి తీయని చోట, బొచ్చెడు కాంక్రీట్ వేయని చోట 70 శాతం పనులు పూర్తి చేసింది టీడీపీ ప్రభుత్వం. 42.5 మీటర్ల ఎత్తున కాఫర్ డ్యామ్ సాయంతో నీళ్ళు నిలవ చేసి గ్రావిటీ ద్వారా కాలువలకు నీరు అందించే ప్రణాళిక సిద్ధం అవుతున్న సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగి తెలుగు దేశం ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. సాఫీగా సాగిపోతున్న నిర్మాణ పనులకు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆటంకం కలిగి పోలవరం భవిత ప్రశ్నార్ధకం అయింది.

ప్రాజెక్టు నిర్మాణ ఖ్యాతి గత ప్రభుత్వానికి దక్కకూడదన్న దురుద్దేశంతో ప్రజా ప్రయోజనాలకు తూట్లు పొడవాలని చూడటం క్షమించరాని నేరం. పోలవరంలో అవినీతి జరిగిందని నిజాలకు నిలువు పాతరేసి, అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని శరవేగంగా నిర్మాణమవుతూ రేడియల్ గేట్ల బిగింపు దశకు చేరుకున్నాక నిర్మాణం నిలిపి వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్ల ప్రజల ఆశలకు బీటలు బార్చింది” అని ఆయన తన వ్యాసంలో పేర్కొన్నారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.