ప్రచారంలో రోజాకు షాక్‌!

నగరి నియోజకవర్గంలో నగరి, నింద్ర, విజయాపురం, పుత్తూరు, వడమాలపేట అయిదు మండలాలు ఉన్నాయి. నగరి మండలంలోని వెలవడి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రోజాకు నిరసనల సెగ తగిలింది. డ్వాక్రా మహిళల పొదుపు సంఘం వారిని కలిసేందుకు ఆమె వెళ్లినప్పుడు లోకల్ మహిళల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. “2014లో మీకు ఓటేస్తే మీరు ఏం చేశారు మాకు? ఏమ్మా గుర్తున్నామా మేము? ఆ పొద్దు ఎప్పుడో ప్రచారానికి వచ్చినప్పుడు చూపినారు మీ మొఖం.

మరల వచ్చినారా ఇటుకేసి ఏమైనా? టీవీల్లో చూసుకోవటమే మా ఎమ్మెల్యేని, ఊర్లో కనిపించేది లే!” అంటూ నిష్ఠూరం ఆడారు. “అయినా మా పిచ్చి గాని మీ పార్టీకి ఓటేసినా మళ్లా మీరు అసెంబ్లీకి ఎళతారా ఏంది? అసెంబ్లీకి పోనే పోక పోతివాయే. ఎందుకేయాల ఓటు? మళ్లీ ఆ పిల్లోడు సీఎం అవకుంటే అసెంబ్లీకి పోనే పోడు, మిమ్మల్ని పోనీయడు. ఎందుకు చెప్పు రోజమ్మా మీకు ఓటు” అంటూ ఒకేసారి విరుచుకు పడ్డారు. మీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో నాకు తెలుసులే అని రోజా ఆగ్రహంగా అక్కడి నుంచి నిష్క్రమించారు. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఇప్పుడు మళ్లీ ఓట్లు అడగటానికి రావటంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం అవుతోంది. అనవసరంగా వారికి ఓటేశాం అనే పశ్చాతాపం కలుగుతోంది వారిలో. ఒక స్కూలుకు ఉపాధ్యాయులు, బ్యాంకుకు బ్యాంకు ఉద్యోగులు, ఆసుప్రతికి వైద్యులు, వైద్య సిబ్బంది సరియైన సమయానికి హాజరు కాకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కదా. మరి, మా నవ్యాంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న శాసనసభ సమావేశాలకు గౌరవ ప్రతిపక్ష శాసన సభ్యులు గైరు హాజరు అయ్యారు.వారు శాసన సభ్యులుగా వేతనం, ఇతర అలవెన్సులు, ఇంటి అద్దె వగైరాలు, దారి ఖర్చు భత్యం తీసుకుంటున్నారు. ఇదంతా ప్రజా ధనం కాదా? అదే సమయంలో బాధ్యతాయుతమైన శాసన సభ్యులుగా వారి బాధ్యతలు, మా హక్కులు (వేము ఓటు వేసి ఎన్నుకున్నందున) మరచి, శాసనసభకు నిర్ణీత సమయంలో హాజరు కాకుండా, ఇతర కార్యక్రమాలలో నిమగ్నం కావడం శిక్షార్హం కాదా? నేరం కాదా ? వీరు తిరిగి శాసనసభ్యులుగా పోటీ చేసే అర్హత కోల్పోరా? ప్రజాధనం, సమయం వ్యర్థం కావడమే కాకుండా, వారు శాసనసభలో అడుగు పెట్టినపుడు చేసిన ప్రమాణాలను కాల రాసినట్లేకదా?

అలాగే రాజ్యాంగ సృష్టికర్తలను, రాజ్యాంగాన్ని, ప్రజలను, రాష్ట్రాన్ని అవమానించినట్లే కదా? అని అడుగుతున్నారు జనం. ప్రజల అజెండా సభలో చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచలేనప్పుడు ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా కొనసాగడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. దానిని అతి పెద్ద సెల్ఫ్‌ గోల్‌గా రాష్ట్ర ప్రజలే కాదు వైసీపీ అభిమానులు కూడా భావించారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.