పుంగనూరులో పెద్దిరెడ్డి ఔట్! అంతర్గత సమీక్షల్లో తేలిందా?

వైకాపా బూత్ కమిటీ నాయకులు పోలింగ్ ముగిసిన మూడు రోజుల తర్వాత సమావేశం అయి బూత్ వారీగా పోలైన ఓట్లపై ఉజ్జాయింపుగా అంచనాలు వేశారు. దాని ప్రకారం పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 10 వేల ఓట్లతో ఓడిపోతారని తేలింది. కానీ బయటకు ఈ విషయం పొక్కనీయకుండా తామే గెలవబోతున్నామని మీడియా ముందు హడావుడి చేశారని పార్టీ వర్గాల్లో గుప్పుమంటోంది. ఎన్నికలు ముగియడంతో ఎక్కడ చూసినా విజయావకాశాలపై రాజకీయ పార్టీలు అంచనాలు, పోలింగ్‌ సరళి సమీక్షలపై తలమునకలయ్యాయి.

పుంగనూరులో అనుహ్య రీతిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్‌.అనీషారెడ్డి విజయ దుందిభి మోగించి పూర్వ వైభవం తీసుకువస్తారని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి కోడలు, మంత్రి అమరనాథరెడ్డి మరదలు నూతనకాల్వ అనీషారెడ్డి పోటీ చేయడంతో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపించింది. సీఎం చంద్రబాబు అనీషారెడ్డి పేరు ప్రకటించగానే ఆమె తన భర్త టీడీపీ సమన్వయకర్త ఎన్‌.శ్రీనాథరెడ్డి మార్గదర్శకంలో పార్టీ పటిష్ఠతపై దృష్టిసారించి ప్రజల్లోకి వేగంగా దూసుకెళ్లారు. నియోజకవర్గంలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు పలు సమావేశాలు నిర్వహించారు. టీడీపీ నాయకులను ఏకం చేయడంలాంటి కార్యక్రమాలు చేపట్టారు. పాల రైతులకు అన్యాయం చేస్తున్నారని, నియోజకవర్గంలో దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపుల అధికమయ్యాయని ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై విమర్శనాస్ర్తాలు సంధించారు. వైసీపీ దాడులను ప్రతిఘటించి టీడీపీ శ్రేణులకు ధైర్యం చెబుతూ భరోసా కల్పించారు.

పుంగనూరుకు హంద్రీనీవా నీరు రావడం, పసుపు, కుంకుమ, పింఛన్లు, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగభృతి, బీసీలకు ఆదరణ పనిమట్ల పంపిణీ తదితర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు దగ్గరైందని ఓటర్లు రుణం తీర్చుకోవడానికి టీడీపీని ఆదరించారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పుంగనూరు సమస్యలు పరిష్కరిస్తానని, ప్రశాంత పుంగనూరు చేస్తానని, చింతపండు రంగానికి గుర్తింపుతో పాటు ఆదనపు ఆదాయం తీసుకొచ్చే చర్యలు ఉంటాయని హామీలిచ్చారు. మరోవైపు అనీషారెడ్డి తన ప్రచారం, ప్రసంగాలతో మహిళల ఆకట్టుకోవడంతో వారి మద్దతు లభించిందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలు వైసీపీకి ఓట్లు వేస్తే బీజేపీకి వేసినట్లేనని జగన్‌, మోదీ ఒక్కటయ్యారని విస్తృత ప్రచారం చేశారు. పుంగనూరులో వైసీపీ నాయకులు కేసీఆర్‌, ఓవైసీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో ఆంధ్రాను, ఇక్కడి ప్రజలను వ్యతిరేకించే తెలంగాణ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై అనీషారెడ్డి పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ అంశాలన్ని టీడీపీ అభ్యర్థి గెలుపునకు సోపానంగా ఉన్నాయని ఆ పార్టీ నేతల్లో ధీమా నెలకొంది.

Copy Protected by Chetan's WP-Copyprotect.