పురంధేశ్వరికి ఎన్‌టీఆర్‌ అభిమాని బహిరంగలేఖ

అమ్మా పురంధేశ్వరి గారు, నంద‌మూరి తార‌క‌ రామారావు గారి వార‌సురాలిగా మీరంటే పార్టీల‌కు అతీతంగా అంద‌రికీ గౌర‌వ‌మే. పైగా.. చిన్న‌మ్మ అంటూ గౌరవిస్తాం. కానీ మీరు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు అధికారం ఉన్న పార్టీల చుట్టే తిరగటం విచారకరం. అనైతికం అయిన పనులు మీరు చేసి ఎదురు టీడీపీని విమర్శించటం సిగ్గుచేటు. తెలుగుదేశం కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపితే ఎన్‌టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని మీరు ప్రవచనం చెబుతున్నారు.

తాను స్థాపించిన పార్టీ చేతులు కలిపితేనే అన్న గారి ఆత్మ క్షోభిస్తే మరి తాను కన్న కుమార్తె పోయి రాజశేఖర్‌రెడ్డి, సోనియా గాంధీల దగ్గర మోకరిల్లిన రోజున ఎన్‌టీఆర్‌ ఆత్మ క్షోభించలేదా? తెలుగుజాతి తన గుండె కాయగా భావించారు ఎన్‌టీఆర్‌. ఈ తెలుగుజాతిని రెండు ముక్కలు చెక్కలుగా చేసిన రోజు కాంగ్రెస్‌ పార్టీలో పదవులు అనుభవిస్తున్న రోజున అన్న గారి ఆత్మ తల్లడిల్లలేదా? రాష్ట్రం మొత్తం భగ్గుమంటుంటే నిస్సిగ్గుగా కేంద్ర మంత్రి పదవులను అంటి పెట్టుకుని భోగాలు అనుభవించిన నాడు, తెలుగు ప్రజల మనోభావాలను మీరు చెత్తబుట్టలో వేసిన నాడు అన్నగారి కుమార్తెగా మీ ఆత్మాభిమానం ఏమైంది? కాంగ్రెస్ అధికారం కోల్పోతోంది, ఏపీ ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది అని తెలిశాకా ఆ పార్టీని వదిలేసి వెంటనే బీజేపీలో చేరిపోయిన మీ అవకాశవాదం చూసి ఊసరవెల్లి సిగ్గుపడలేదా? తెలుగుదేశంకు పూర్తి విరుద్ధం కాంగ్రెస్. కాంగ్రెస్‌కు పూర్తి విరుద్ధం బీజేపీ సిద్ధాంతం. కానీ మీరు అప్పటికప్పుడు

ఎవరు అధికారంలోకి వస్తారో తెలుసుకుని మీ సిద్ధాంతాలను వెంటనే రీ రైట్ చేసేస్తారు. తిరగ రాసేసుకుని విధేయతలు మార్చేసుకుంటారు. అన్న గారి అమ్మాయికి ఇంత పదవీ పిచ్చ ఉందా అని ఆవేదనగా ఉంది? కాంగ్రెస్‌లో ఎందుకు చేరారు? ఎందుకు వీడారు? రాష్ట్ర విభజనే కారణం అయితే విభజన చేసిన రోజునే ఎందుకు వదల్లేదు పార్టీని? ఆఖరి నిమిషం వరకు మీకు పదవీ భోగాలు కావాల్సి వచ్చాయా? విభజన నాడూ మీరు రాష్ట్రానికి అన్యాయం చేసిన వారి వైపే ఉన్నారు. ఈరోజూ రాష్ట్రానికి మోసం, ద్రోహం, దగా చేసిన వారి వైపే ఉన్నారు. అన్న గారి అమ్మాయి ప్రజలతో కలిసి ఉండదా? కేంద్రానికి కట్టు బానిసా? రాష్ట్ర ప్రజల మనోభావాలు పట్టవా? తెలుగుదేశం అయిపోయింది. కాంగ్రెస్‌ సరదా తీరింది. బీజేపీ ముచ్చటా ముగిసింది. ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్లి వైసీపీలో చేరబోతున్నారా? తెలుగుదేశం గురించి మీరు ఏ ఒక్క మాట మాట్లాడినా ఊసరవెల్లి సిగ్గుతో చచ్చిపోతుంది మీలా రంగులు మార్చలేకపోయానే అని! ఇట్లు ఎన్‌టీఆర్ అభిమాని.

Copy Protected by Chetan's WP-Copyprotect.