ఒకప్పుడు బాగా బతికిన జిల్లాలో పూర్వవైభవం దిశగా టీడీపీ!

ఆ జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు ఉంటే 15కి 15 టీడీపీనే గెలిచింది. అన్ని మున్సిపాల్టీలు టీడీపీనే గెలిచింది. జడ్పీ కూడా టీడీపీనే గెలిచింది. ఎంపీలు కూడా టీడీపీనే గెలిచింది. కానీ కాలం కలిసిరాక ఇటీవల చతికల పడింది. ఈ పరిణామం పార్టీ శ్రేణులను కుదేలయ్యేలా చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోనిదే ఈ పరిస్థితి. అయితే ఈ స్థితి నుంచి మళ్లీ పశ్చిమ టీడీపీ శ్రేణులు పుంజుకుంటున్నాయి. అధికార పార్టీ తప్పిదాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.

పోయిన చోటే వెతుక్కోవాలి అని సామెత! ఈ మాట ఇప్పుడు పశ్చిమ గోదావరిలో తెలుగుదేశం పార్టీకి ఎంచక్కా వర్తిస్తుంది. ఈ వివరాలు తెలుసుకోవాలంటే కొంత నేపథ్యంలోకి వెళ్లాలి. పశ్చిమగోదావరి జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. పలుమార్లు టీడీపీ అధికారంలోకి రావడానికి పశ్చిమలో ఆ పార్టీకి వచ్చిన సీట్లే కీలకంగా మారాయి. రాష్ట్రంలో పార్టీ ఓడినప్పుడు కూడా.. ఇక్కడి ఓటర్లు తెలుగుదేశానికే జైకొట్టిన సందర్భాలున్నాయి. అటువంటి పశ్చిమ ఓటర్లు ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవాన్ని మిగిల్చారు. పదిహేను అసెంబ్లీ సెగ్మంట్లలో కేవలం రెండుచోట్ల మాత్రమే ఆ పార్టీ అభ్యర్ధులను గెలిపించారు. గతంలో జిల్లావాసులు ఎన్నడూ టీడీపీకి ఇంత భయకరమైన షాక్ ఇవ్వలేదు! కంచుకోటలాంటి పశ్చిమ గోదావరిలో తమ పార్టీకి రెండంటే రెండు సీట్లే రావడంతో జిల్లా టీడీపీ నేతలు దిగాలు పడిపోయారు. పార్టీ భవిష్యత్తు ఏమిటన్న డైలమాలో పడ్డారు.అయితే ఇదంతా నిన్నమొన్నటి వరకూ ఉన్న పరిస్థితి! ఇప్పుడు సీన్ మారిపోతోంది. టీడీపీ నాయకులు రోడ్లపైకి వస్తున్నారు. అధికార పార్టీ చేస్తున్న తప్పిదాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. దీంతో టీడీపీ క్యాడర్‌లోనూ ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అయితే జిల్లాలో ఒక్కసారిగా సీన్‌ ఇలా మారడానికి కారణమేంటి? తెలుగు తమ్ముళ్లలో ఇంత కదలిక ఎలా వచ్చింది? అని ఆరాతీస్తే ఆసక్తికరమైన అంశాలు తేటతెల్లమయ్యాయి. పశ్చిమలో టీడీపీ పుంజుకోవడానికి పార్టీ అధినాయకత్వం గట్టి చర్యలే తీసుకుంటోంది. ముఖ్యంగా అధికార పార్టీ చేస్తున్న తప్పిదాలను హైకమాండ్‌ టార్గెట్‌గా చేస్తోంది. ఈ చర్యలే జిల్లా టీడీపీ నేతల్లో జోష్ పెంచుతోందట. ఇందుకు ఇసుక కొరతను ఒక ఉదాహరణగా చెప్తున్నారు పరిశీలకులు. ఈ సమస్య అన్ని జిల్లాల్లోనూ ఉన్నప్పటికీ, పశ్చిమలో మరింత ఎక్కువగానే కనిపిస్తోంది. ఇసుక కొరత ప్రభావం నిర్మాణరంగంపై బాగా పడింది.అంతేకాదు- జిల్లాలో ఇసుక రీచ్‌లలో పనిచేసే కార్మికులు సైతం రోడ్డున పడ్డారు. ఈ సమస్యను అధికార వైసీపీ తేలికగా తీసుకుంది. కానీ జిల్లా టీడీపీ నాయకులు మాత్రం యమ సీరియస్‌గా టేకప్‌ చేశారు. వీలైనప్పుడల్లా.. ఇసుక కొరతపై వైసీపీ వైఖరిని ఎండగడుతూనే ఉన్నారు. తద్వారా తాము ప్రజల పక్షాన ఉన్నామన్న భావనను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకు వెళ్లగలిగారు. గోదావరి వరదల సమయంలో కూడా అధికార వైసీపీ తన సమర్థతని చాటుకోలేకపోయింది. ఈ అంశాన్ని టీడీపీ వర్గాలు ముందుగానే పసిగట్టాయి. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకోవడానికి వరద బాధిత ప్రాంతాల్లో వెంటనే లోకేశ్‌ పర్యటనను ఏర్పాటుచేశారు టీడీపీ నేతలు. లోకేశ్‌ కూడా అంతే నిబద్దతతో ఈ పర్యటనలో పాల్గొన్నారు. వరద ప్రాంతాల్లో జిల్లాకు చెందిన మంత్రి రంగనాథరాజు మినహా మరెవ్వరూ పర్యటించకపోవడంతో.. వైసీపీ ప్రభుత్వ తీరుపై స్థానికంగా గట్టి విమర్శలే వినిపించాయి.

వరద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంటే.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే చేసి వెళ్లిపోవడం, జలవనరుల శాఖమంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పోలవరం వస్తున్నట్లుగా అధికారులకు సమాచారం ఇచ్చి, చివరి నిముషంలో తన పర్యటనను రద్దు చేసుకోవడం వంటి ఘటనలు టీడీపీకి బాగా కలిసొచ్చాయి. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే కాకుండా.. తామే వరదప్రాంతాల్లో మొదటిసారిగా ప్రజలను పలకరించేందుకు వచ్చామన్న భావన కల్పించేందుకు లోకేశ్‌ టూర్‌ను బాగా ఉపయోగించుకున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇందుకు తగ్గట్టుగానే చిన్నసార్ టూర్ సక్సెస్ కావడం పార్టీ వర్గాలకు మరింత ఊతమిచ్చింది. ఇక అన్నా క్యాంటీన్లకు సంబంధించి హైకమాండ్ ఇచ్చిన పిలుపుమేరకు చేపట్టిన ఆందోళనలు పార్టీ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ కేకపుట్టించాయి. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు అన్నా క్యాంటీన్ల వద్ద నిరసనలు చేపట్టారు. ఈ తరుణంలో కొన్నిచోట్ల టీడీపీ నేతలు అరెస్ట్ కావడంతో ఆ పార్టీ పట్ల ప్రజల్లో కొంత సానుభూతి ఏర్పడింది. మరికొన్ని చోట్ల టీడీపీ నాయకులే స్వయంగా అన్నా క్యాంటీన్ల వద్ద పేదలకు భోజనాలు ఏర్పాటుచేశారు. ఈ పరిణామమూ టీడీపీ పట్ల ప్రజల్లో సానుకూలతను పెంచాయని లోకల్ టాక్‌.

Copy Protected by Chetan's WP-Copyprotect.