రజనీ ఏ రియల్‌ హీరో! వాటిల్లో ఫస్ట్ పేరు తనదే!

భారత దేశంలో మాస్‌ ఫాలోయింగ్ అత్యధికంగా ఉన్న నటుల లిస్టు రాస్తే అందులో ఫస్ట్ పేరు రజనీదే. స్టయిల్స్‌లో ఎవరు గొప్ప హీరోలు అని రాస్తే అందులో తొలి పేరు రజనీకాంత్‌దే రాయాలి. ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఎక్కువ ఏ హీరోకి ఉన్నారు లిస్ట్ చేస్తే మొదట రాయాల్సిన పేరే రజనీకాంత్‌. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప నటుల పేరు రాస్తే రజనీ పేరే తొలి పేరు అవుతుంది.ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న భారతీయ నటుల పేరు రాస్తే మొదట రజనీ నేమ్ రాయాలి. సూపర్ స్టార్ రజనీకాంత్….కోట్లాది రూపాయల భారీ బడ్జెట్ సినిమాలు…భారత్ లోనే కాక చైనా, జపాన్, హాంగ్ కాంగ్ వంటి ఎన్నో దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా సంపాదించుకున్న కోట్లాది మంది అభిమానులు…డబ్బు ఎంత ఉంటుందో ఆయనకే తేలీదు

ఇంతున్నా ఆయనకు అహం అంటే ఏమిటో ఆఫ్ స్క్రీన్ హీరోయిజం అంటే ఏమిటో తెలీదు. ఆయన నటనా జీవితం మొదలు పెట్టి నలభై నాలుగేళ్ళు పూర్తి అయ్యాయి. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అని బాలీవుడ్ మీడియా సంభోదించినా, తలైవా అని తమిళ ప్రజలు పిలుచుకున్నా ఆయననే. ఇండియాలో మరే సినీ న‌టుడికీ ఈయనకున్నంత ఫాలోయింగ్ లేదేమో…ఆయ‌న సినిమా వ‌స్తుందంటే చాలు… అప్పుడు ఉండే హ‌డావిడి అంతా ఇంతా కాదు.సినిమా రిలీజైన రోజైతే అభిమానుల‌కు ఇక పండ‌గే. 1950లో బెంగళూరులో స్థిరపడ్డ ఒక మరాఠా కుటుంబంలో జన్మించారు శివాజీ రావ్ గైక్వాడ్. ఓ సాధారణ బస్ కండక్టర్ గా జీవితాన్ని ప్రారంభించి.. ఇప్పుడు కోట్లాది మంది చూపుండే సినీసామ్రాజ్యాన్ని ఏలుతున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. బెంగుళూర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ లో బస్ కండక్టర్ గా జీవితం ప్రారంభించిన రజనీ సినిమాల్లోకి రావాలని భావించి 1973లో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందారు. ఆ తరువాత రెండేళ్ళకు అంటే 1975లో బాలచందర్ ఆయనకు తొలి అవకాశం ఇచ్చారు. మొదట్లో చిన్న పాత్రలు ఎన్నో వేసిన రజనీ తనను తాను రుజువు చేసుకుంటూ వచ్చారు.
అలా ‘అపూర్వ రాగంగళ్’ సినిమాతో నటుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన ఆ మూవీ రిలీజై ఇటీవలే 44 ఏళ్లు పూర్తి అయ్యాయి. మహారాష్ట్రకు చెందిన గైక్వాడ్స్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి….కర్నాటకలో జన్మించడం ఏమిటి?అతడి ప్రయాణం తమిళనాడు వైపు సాగడం ఏంటో ? తమిళ బాషను ప్రేమించే తమిళ ప్రజలు తమ భాషవాడు కాక పోయినా, తమ రాష్ట్రంలో పుట్టినవాడు కాక పోయినా…. అతడిని నెంబర్ వన్ స్టార్‌ను చేయడం ఏమిటి? అంతా యాదృచ్చికం కదూ. తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రజనీ ఎదుగుతూ వచ్చారు.

చిన్న పాత్రే అయినా తన స్టైల్‌, మేనరిజమ్స్‌తో అదరగొట్టేవారు. వయదినిలె చిత్రంలో కమల్ హాసన్ హీరో. రజనీకాంత్ చిన్న విలన్ పాత్ర చేశారు. కానీ సినిమా రిలీజ్‌ అయ్యాక థియేటర్లో రజనీకాంత్‌ డైలాగ్‌లు, మేనరిజమ్స్‌కు ఎక్కువ చప్పట్లు వచ్చాయి. ఆయన కథానాయకుడిగా నటించిన ‘భైరవి’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అప్పుడే ఆయన పేరు ముందు ‘సూపర్‌స్టార్‌’ అని వేశారు. రజనీ తన కెరీర్లో ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. ఇప్పటిదాకా 165 సినిమాలలో నటించిన ఆయన తన 166వ సినిమా దర్బార్ షూట్ జరుపుకుంటోంది.

Copy Protected by Chetan's WP-Copyprotect.