సీసీటీవీ ఫుటేజీలపై రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

తెరాస ఎన్నికల గుర్తు “కారు”ను దృష్టిలో పెట్టుకుని ప్రచార సభల్లో మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రసంగాలపై రివర్స్‌ పంచ్‌లు వేశారు రేవంత్‌ రెడ్డి. “కారు వేగంగా పోతోంద‌నీ, ఇలాంటి సమయంలో డ్రైవ‌ర్ ని మార్చొద్ద‌ని కేటీఆర్‌ ప్ర‌జ‌ల‌కు చెబుతున్నారు. వాస్త‌వానికి కారు డ్రైవ‌ర్ ని మార్చాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ది మీ బావ హరీష్ రావు, ఈ విష‌యం కేసీఆర్ కూడా తెలుసుకోవాలి” అని రేవంత్ వ్యాఖ్యానించారు. హరీశ్‌రావు నిప్పులో నడిచినా తన శీలాన్ని నిరూపించుకోలేరని కాంగ్రెస్ నేత రేవంత్ అన్నారు.

గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ హరీశ్‌రావు తలకాయ కోసుకుని కేసీఆర్ ముందు పెడితే ఇది తలకాయ కాదు.. పుచ్చకాయ అని అంటారని అన్నారు. ఎందుకంటే ‘‘నువ్వు ఎట్లాంటివాడివో.. నువ్వు నమ్మినవాళ్లను ఎలా మోసం చేశావో మీ మామ కేసీఆర్‌కు స్పష్టంగా తెలుసునని, నీ పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో మేనమామకు చెప్పాల్సిన అవసరం లేదని, నీ జాతకం అంతా మీ మామ వద్ద ఉన్నదని, నువ్వు ఏమేమి చేశావో కేసీఆర్‌కు’’ తెలుసునని రేవంత్ అన్నారు. కేసీఆర్‌ను నమ్మించడానికి హరీశ్ పదే పదే మహాకూటమిపై విమర్శలు చేస్తున్నారని, ఇవాళ చంద్రబాబుకు లేఖ కూడా రాశారని రేవంత్ విమర్శించారు. గత నెల 25వ తేదీ సాయంత్రం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గజ్వేల్లో ఉండే నర్సారెడ్డిని తీసుకుని హరీశ్ క్వార్టర్‌కు వచ్చి 3 గంటలపాటు రహస్య చర్చలు జరిపిన తర్వాత, మరుసటి రోజు ఉదయం ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారంటే.. హరీశ్-కేసీఆర్ మధ్య ఉప్పు, నిప్పులా ఉందా? లేదా? అన్నది ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

గ‌త నెల 25వ తేదీ సాయంత్రం, మెద‌క్ ఎంపీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, గ‌జ్వేల్ న‌ర్సారెడ్డిని త‌న వాహ‌నంలో ఎక్కించుకుని రాత్రి తొమ్మిదిన్న‌ర‌కు మంత్రి హ‌రీష్ రావు క్వార్ట‌ర్స్ కి తీసుకెళ్లారు అని చెప్పారు రేవంత్. ఆ త‌రువాత‌, మూడు గంట‌ల సేపు హ‌రీష్ రావుతో న‌ర్సారెడ్డి మాట్లాడార‌న్నారు. ఆ మ‌ర్నాడే, హైదరాబాద్ నుంచి విమాన‌మెక్కి న‌ర్సారెడ్డి ఢిల్లీకి హుటాహుటిన వ‌చ్చి, కాంగ్రెస్ పార్టీలో చేరారు అన్నారు. వాస్త‌వానికి, కాంగ్రెస్ లో ఉండే న‌ర్సా రెడ్డి తెరాస‌లో చేరి, కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ అయ్యార‌నీ, కానీ హ‌రీష్ రావు క‌లిసిన మ‌ర్నాడే ఆయ‌న ఎందుకు కాంగ్రెస్ లో చేరారు అనేది ప్ర‌జ‌ల‌కు మంత్రి వివ‌రించాల‌ని డిమాండ్ చేశారు. హ‌రీష్ రావుతో చ‌ర్చ‌ల త‌రువాతే ఆయ‌న కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారంటేనే కేసీఆర్‌, హ‌రీష్ రావుల మ‌ధ్య ప‌రిస్థితి ఎలా ఉంద‌నేది అర్థ‌మైపోతోంద‌న్నారు. తుఫాను ముందు ప్ర‌శాంత‌త‌, విచ్ఛిన్నం కాబోయేముందు నిశ్శ‌బ్దంలా తెరాస‌లో ఆధిప‌త్య పోరు ఉంద‌ని రేవంత్ వ్యాఖ్యానించారు. మినిస్ట‌ర్ కార్ట‌ర్స్ లోని సీసీ కెమెరా ఫుటేజ్ ల‌న్నీ బ‌య‌టపెట్టాల‌నీ, 25 నాడు సాయంత్రం ఏడు నుంచి రాత్రి 1 గంట వ‌ర‌కూ హ‌రీష్ రావు అధికారిక నివాసంలోకి వెళ్లిన కార్లు, బ‌య‌ట‌కి వ‌చ్చిన కార్లు, వాటిలో ఉన్న ప్ర‌ముఖులు ఎవ‌ర‌నేది బ‌య‌ట‌పెడితే… తెర వెన‌క జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర రావుకి, కేటీఆర్ కి, తెలంగాణ స‌మాజానికీ స్ప‌ష్టత వ‌స్తుంద‌న్నారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.