ఆర్టీసీ కార్మికుల్లో టెన్షన్‌..టెన్షన్‌! ప్రభుత్వ ఉద్యోగులేన్న సీఎం! విలీనంతో ఇబ్బందులన్న కమిటీ! కమిటీలో కార్మిక సంఘాలకు చోటేది?

‘ఈ రోజు నుంచి మీరు ప్రభుత్వ ఉద్యోగులు.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం..’ ..ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జూన్‌ 12న అసెంబ్లీలోని తన చాంబర్‌లో ఆర్టీసీ జేఏసీ నేతలతో అన్న మాటలివి. ‘సంస్థ విలీనంతో నష్టాలేంటో మీకు తెలుసా..? అద్దె బస్సులు ఎన్నైనా పెంచుకోవచ్చు.. రూట్లు ప్రైవేటుకు ఇవ్వొచ్చు.. సంస్థను జోన్ల వారీగా విభజించవచ్చు.. ముఖ్యంగా యూనియన్లకు పోరాడే హక్కులుండవు..’ జూన్‌ 27న విలీన కమిటీ సభ్యులు ఆర్టీసీ హౌస్‌లో కార్మిక సంఘాల నేతలతో చెప్పిన మాటలివి.‘విలీనంపై విధివిధానాలు త్వరగా రూపొందించండి… సెప్టెంబరు 13లోపు ప్రక్రియ పూర్తవ్వాలి.’ ఆగస్టు 20న నిపుణుల కమిటీకి మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలివి. ‘

కేంద్ర ఉపరితల రవాణాశాఖ అనుమతి లేకుండా విలీనం కష్టం.. ప్రస్తుతానికి మధ్యంతర నివేదిక సిద్ధం చేశాం.. సీఎంతో చర్చించి మీరు చెబితే పూర్తి నివేదిక రెడీ చేస్తాం’ మంత్రులకు నిపుణుల కమిటీ ఇచ్చిన సమాధానమిది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై తాజా పరిణామాలు కార్మికులు, సిబ్బందిలో ఆందోళన పెంచుతున్నాయు. ఏపీఎ్‌సఆర్టీసీ.. రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. తాము అధికారంలో కొస్తే ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ అధినేత జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆ దిశగా అడుగులు వేశారు. సీఎం హామీ మేరకు జూన్‌ 14న రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది.నివేదిక రూపొందించి మూడు నెలల్లోపు ప్రభుత్వానికి ఇవ్వాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కమిటీలో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆర్టీసీ అధికారులు, కార్మికుల అభిప్రాయాలు తీసుకోవడానికి జూన్‌ 27న కమిటీ సభ్యులు విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో సమావేశం అయ్యారు. గుర్తింపు కార్మిక సంఘం ఈయూతోపాటు ఎన్‌ఎంయూ, కార్మిక పరిషత్‌, ఎస్‌డబ్ల్యూఎఫ్‌, వైఎ్‌సఆర్‌ మజ్దూర్‌ తదితర పది కార్మిక సంఘాలు, అధికారుల సంఘం తమ అభిప్రాయాలను విడివిడిగా తెలియజేశాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అన్నీ లాభాలే ఉంటాయనుకుంటున్నారా.? నష్టాలు కూడా ఉంటాయి. విలీనమైతే సిబ్బందిని తగ్గించినా.. అద్డె బస్సులు పెంచుకున్నా.. ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని నియమించుకున్నా.. ఆర్టీసీ రూట్లు ప్రైవేటు వారికిచ్చినా.. మీకు సంబంధం ఉండదు.ఇప్పుడున్న ట్రేడ్‌ యూనియన్‌ హక్కులేవీ ఉండవు.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు వస్తాయని అనుకోవద్దు.. పెన్షన్‌ అనేది మరీ అత్యాశ’ అని కమిటీ సభ్యులు చెప్పడంతో ఆర్టీసీ సిబ్బందిలో కలవరం మొదలైంది.

విలీనంతో ఉపయోగమేంటి? ప్రతినెలా ఆర్టీసీ కార్మికులకు ప్రభు త్వ ఖజానా నుంచి జీతాలు అందుతాయి. సంస్థ ఆర్థిక ఇబ్బందులతో వారికి ఎలాంటి సమస్యా ఉండదు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పదవీ విరమణ వయసు 58 నుంచి 60కి పెరుగుతుంది. ఆర్టీసీ పేరు తీసేసి నాలుగైదు కార్పొరేషన్లుగా విభజించినా అడిగే అవకాశం ఉండదని అంటున్నారు. పత్రికా కథనాలు ఎలా ఉన్నా నిజానిజాలు ఏంటి? అంతిమంగా ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ప్రతిపాదనల దశలో అనేకం చర్చించినా చివరాఖరుకు ఏం డిసైడ్ చేస్తారో చూడాలి.

Copy Protected by Chetan's WP-Copyprotect.