సోషల్ మీడియాకు సంకెళ్లు? అది అమల్లోకి వస్తే ఇక అంతే!

ప్రధాన మీడియా ప్రముఖులకు, పెద్దలకు మాత్రమే పరిమితం. ఓ సామాన్యుడి తన బాధను ప్రపంచ దృష్టికి తీసుకు రావాలని అనుకుంటే అందుకు వేదిక సామాజిక మాధ్యమాలు మాత్రమే. ఒక్కోసారి అక్కడ తమ ఐడెంటిటీని బయట పెడితే అక్రమార్కులు పగబట్టి అంతం చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు గోప్యత అవసరం. కానీ ఇప్పుడు తమిళ ప్రభుత్వం చేసే పని వల్ల సామాజిక మాధ్యమాల్లో వ్యక్తి స్వాతంత్య్రానికి ఎదురు దెబ్బ తగిలే ప్రమాదం ఉంది.ఇది స్వేచ్ఛకు సంకెళ్లు వేసే ప్రయత్నమే. సోషల్‌ మీడియాలో వ్యక్తి స్వేచ్ఛకు కళ్లెం వేయాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తున్నట్టు ఉంది. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ట్విటర్‌, వాట్సాప్‌ ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని తమిళ సర్కార్‌ డిసైడ్ అయింది. అలా చేయడం తమ విధానాలకు విరుద్ధమని ఫేస్‌బుక్‌ వాదిస్తున్నాయి. ఈ వ్యాజ్యం సుప్రీంకోర్టు ముందుకు రాగా.. దీనిపై రెండు వారాల్లోగా వాదనలు వినిపించాలంటూ కేంద్ర ప్రభుత్వం, ట్విటర్‌, గూగుల్‌, యూట్యూబ్‌ తదితర సంస్థలకు మంగళవారం నోటీసులు జారీచేసింది.

కేసు తదుపరి విచారణను సెప్టెంబరు 13కు వాయిదా వేసింది. ఇదీ నేపథ్యం.. వాట్సాప్‌ వంటి మెసెంజర్లు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ట్విటర్‌ వంటి సోషల్‌ మీడియా ఖాతాల్లో వదంతులు, విద్వేష ప్రచారం వల్ల హింసాత్మక ఘటనలు, మూక దాడులు పెరిగి పోతున్నాయి కాబట్టి.. ఆయా ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలంటూ తమిళనాడు హైకోర్టులో రెండు, మధ్యప్రదేశ్‌ హైకోర్టులో ఒకటి, బాంబే హైకోర్టులో ఒకటి చొప్పున దేశ వ్యాప్తంగా నాలుగు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.సోషల్‌ మీడియా ఖాతాలకు ఆధార్‌ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్న ఫేస్‌బుక్‌.. దీనిపై సుప్రీంను ఆశ్రయించింది. వివిధ రాష్ట్రాల్లో వివిధ కేసులు దాఖలై, వేర్వేరు తీర్పులు వస్తే ఇబ్బంది కాబట్టి అన్ని కేసులనూ అత్యున్నత న్యాయస్థానమే విచారించాలని కోరింది. ఫేస్‌బుక్‌ అభ్యర్థనను సుప్రీంకోర్టు అనుమతించింది. జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ అనిరుద్ధ ఘోసేలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో తమిళనాడు ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదించారు. సోషల్‌ మీడియా వినియోగదారుల ప్రొఫైల్స్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయాల్సిందేనన్నారు. ‘‘తప్పుడు వార్తలను, పరువునష్టం కలిగించే వార్తలను, అశ్లీల చిత్రాలు, వీడియోలను, దేశ వ్యతిరేక, ఉగ్రవాద సందేశాలను అరికట్టడానికి సోషల్‌మీడియా ప్రొఫైల్స్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయడం అత్యవసరం’’ అని ఆయన వాదన వినిపించారు. బ్లూవేల్‌ గేమ్‌ మన దేశంలో ఎంతోమంది యువతీయువకుల ప్రాణాలు తీసిందని వేణుగోపాల్‌ గుర్తుచేశారు.ఆన్‌లైన్‌లో వస్తున్న అలాంటివాటి మూలాలను కనుగొనడం సవాల్‌గా మారిందన్నారు. ఆ తరహా గేమ్‌ల ప్రచారంలో కీలకంగా ఉన్న సోషల్‌ మీడియా సేవలను ఉపయోగించుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు.ప్రజలకుండే ఆన్‌లైన్‌ గోప్యత హక్కుకు, వెబ్‌సైట్లను ఉపయోగించి నేరాలకు పాల్పడుతూ, ప్రజల్లో భయోత్పాతం కలిగించేవారిని గుర్తించేందుకు ప్రభుత్వానికి ఉండే హక్కు మధ్య సమతౌల్యం ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా, ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ దీపక్‌ గుప్తా ‘డార్క్‌ వెబ్‌’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘దాన్ని (డార్క్‌ వెబ్‌ను) ఎలా యాక్సెస్‌ చేయాలో నాకు తెలియదు. కానీ, అందులో జరిగే చీకటి కార్యకలాపాల గురించి నేను విన్నాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు. సోషల్‌ మీడియా ఖాతాలకు ఆధార్‌ అనుసంధానించడం తమ వినియోగదారుల వ్యక్తి గత గోప్యత హక్కులకు భంగం కలిగిస్తుందన్నది ఫేస్‌బుక్‌ వాదన.

అవసరమైతే వారి మొబైల్‌ నంబర్‌, ఈమెయిల్‌ చిరునామా వంటి వివరాలే ఇవ్వగలమంది. సోషల్‌ మీడియా సంస్థల తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, కపిల్‌ సిబల్‌ వాదించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఈ తరహా కేసులన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ తాము అత్యున్నత న్యాయస్థానం గడపతొక్కామని.. కానీ, తమిళనాడు ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అటార్నీజనరల్‌ కేకే వేణుగోపాల్‌ అనవసరంగా కేసు మెరిట్స్‌లోకి వెళ్తున్నారని రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు. కేవలం కేసుల బదిలీపైనే వేణుగోపాల్‌ వాదించాలన్నారు. అలాగే.. సోషల్‌ మీడియా వినియోగదారుల వ్యక్తిగత గోప్యతపై ప్రభావం చూపే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది దేశ అత్యున్నత న్యాయస్థానమే తప్ప హైకోర్టులు కాదన్నారు. అయితే, కోర్టు మాత్రం దీనిపై కేంద్రానికి, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై హైకోర్టుల్లో ఉన్న కేసుల విచారణ కొనసాగించుకోవచ్చుగానీ.. తుది ఉత్తర్వులు వెలువరించరాదని ఆదేశించింది.

Copy Protected by Chetan's WP-Copyprotect.