రాజధానిని ఏకపక్షంగా మారిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదు! ఎంపీ సుజనా చౌదరి హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని అమరావతి నుంచి ఏకపక్షంగా వేరే చోటకు మార్చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. ప్రజలు, రైతులు తిరగబడతారని హెచ్చరించారు. ఆయన బుధవారం ఢిల్లీలోని తన అధికార నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘రాజధాని కోసం రైతులు తమ పచ్చని పంట భూములిచ్చి త్యాగాలు చేశారు. గత ఐదేళ్లుగా అమరావతి ప్రాంతంలో వందల కోట్ల విలువైన ఆస్తులను సృష్టించారు. ఇప్పుడు రాజధానిని మార్చితే వందల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తుల మాటేమిటి?

అర్ధాంతరంగా రాజధానిని మారుస్తామంటూ చేస్తున్న ప్రచారంతో ప్రజల్లో లేనిపోని గందరగోళం నెలకొంటోంది.ప్రజాస్వామ్యంలో ఏకపక్ష నిర్ణయాలు చెల్లవు. ప్రజల ఓట్లతో గెల్చిన ప్రభుత్వం ఏకపక్షంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వారు ఎదురు తిరుగుతారు. ఇలాంటి నిర్ణయం నిజంగా జరిగితే పద్ధతి కాదు’ అని స్పష్టం చేశారు. రాజధాని మార్పుపై రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు తలో రకంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని మారొచ్చని చెబుతుంటే.. రాజధాని మార్పుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని, ఈ విషయంలో బొత్సకు సంబంధం లేదని మరో మంత్రి అవంతి శ్రీనివాసరావు అంటున్నారని.. వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోలా చెబుతున్నారని, ఒకరికొకరు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌ ఈ పరస్పర విరుద్ధ, గందరగోళ వ్యాఖ్యలపై తక్షణమే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.వరద ముంపు కారణంతో రాజధాని మార్పు జరగొచ్చన్న బొత్స వ్యాఖ్యలకు అర్థం లేదన్నారు. ఆంధ్రలో కృష్ణా పరీవాహక ప్రాంతంలో వరదలతో ప్రజలంతా ఆస్తులు, పంటలు నష్టపోయి, నిరాశ్రయులై అల్లాడిపోతుంటే వరద రాజకీయాలతో పరిపాలనంతా గాలికొదిలేస్తారా అని జగన్‌ ప్రభుత్వంపై సుజనా మండిపడ్డారు. బాధితులను ఆదుకోవాల్సిన పాలకులు ఈ సమయంలో కూడా రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేయడం శోచనీయమన్నారు. కృష్ణా ఎగువ ప్రాంతం నుంచి వరదలు వచ్చే ప్రమాదం ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రాష్ట్రప్రభుత్వాన్ని ముందుగానే హెచ్చరించినా ఎందుకు అప్రమత్తం కాలేదని ప్రశ్నించారు. లక్షల క్యూసెక్కుల నీటిని ఒకేసారి విడుదల చేసి.. వరదలతో ప్రజల్ని భయాందోళనలకు గురిచేయడం సమంజసమా అని ప్రశ్నించారు. ‘ప్రభుత్వం కావాలనే వరదలతో అమరావతి ప్రాంతం ముంపునకు గురిచేసి ప్రజలను భయపెట్టాలని సంకుచిత బుద్ధితో ఆలోచించిందా?

లేక ఇంజనీరింగ్‌ అధికారుల అలసత్వమా? పాలకుల కుట్ర, కుతంత్రం ఉందా? అనే సందేహాలకు జవాబు చెప్పాలి. చేతకానితనమో లేదంటే కావాలనే జలాశయాలను సరిగా పర్యవేక్షించకుండా వరద ముప్పునకు అవకాశం ఇచ్చారో తెలియదు. కానీ ప్రభుత్వ అలసత్వంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు ప్రాంతాలు ముంపుతో ఇబ్బంది పడుతున్నాయి. మరోపక్క రాయలసీమకు సాగునీరులేక పంటలు ఎండబెడుతున్నారు. ఇదెక్కడి న్యాయం’ అని నిలదీశారు. ప్రజలు వరద కష్టాల్లో ఉంటే టీడీపీ నేతలు కూడా చంద్రబాబు ఇంటి చుట్టూ ప్రదక్షిణలతోనే సమయాన్ని వృధా చేస్తున్నారని, బాబుకు భజన చేయడానికి ఆయన ఇల్లు ఒక్కటే మునగకుండా చూసుకుంటే సరిపోతుందా అని ఆయన ప్రశ్నించారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.