విశాఖలో బాబు ల్యాండ్ అయ్యాడు! అనకాపల్లి, విశాఖ ఎంపీ సీట్లపై సరికొత్త వ్యూహాన్ని లీడర్లకు చెప్పాడు! ఆ ఇద్దరికే ఆ రెండు ఎంపీ సీట్లు!

భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన కోసం గురువారం విశాఖ వెళ్లిన సీఎం చంద్రబాబు మంత్రి గంటా శ్రీనివాసరావు సహా కొందరు కీలక నేతలతో సమావేశం అయ్యారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీ వీడిన నేపథ్యంలో తాజా వ్యూహాలను చంద్రబాబు వివరించారు. తొలుత సబ్బంహరిని అనకాపల్లి నుంచి దించాలని భావించానని కానీ ఇప్పుడు వేరే ఆప్షన్లు ముందుకు వచ్చాయని అన్నట్టు తెలిసింది. తాజాగా అనకాపల్లి ఎంపీ సీటుకు మాజీ మంత్రి, మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ పేరును సీఎం పరిశీలిస్తున్నారు. అలాగే మరో స్టార్ లీడర్ సబ్బంహరిని విశాఖ ఎంపీ సీటుకు పరిశీలిస్తున్నారని సమాచారం. పార్టీ నుంచి ఒకరు బయటకు వెళితే ఇద్దరు లోపలికి వస్తారనే సంకేతం ఇవ్వాలని సీఎం ఆలోచనగా చెబుతున్నారు. గతంలో విశాఖ ఎంపీ సీటును బీజేపీకి పొత్తులో భాగంగా కేటాయించారు. బీజేపీ నేత కంభంపాటి హరిబాబు ఎంపీగా నెగ్గారు.

పొత్తు లేదు కాబట్టి ఇప్పుడు ఆ సీటు సబ్బంహరికి ఇవ్వాలనేది ఒక ప్రపోజల్ ఉంది. అలాగే ఇప్పుడు వైసీపీలోకి వెళ్లిన అవంతి శ్రీనివాస్ ఖాళీ చేసే అనకాపల్లి సీటును కొణతాల రామకృష్ణకు ఇవ్వాలని ప్రతిపాదన పరిశీలిస్తున్నారు. వారిద్దరూ ఈ పాటికే సీఎం సమయం కోరి ఉన్నారు. త్వరలోనే వారిని విడివిడిగా పిలిచి కన్‌ఫర్మ్ చేసే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. వాస్తవానికి జిల్లాలో లోక్‌సభకు పోటీ చేయడానికి సీనియర్‌ నాయకులు ఎవరూ ముందుకురారు. పార్టీ బలవంతంగా పోటీకి దించడమో, లేదంటే కొత్త వారిని తీసుకురావడమో జరుగుతోంది. దాంతో ప్రతి ఎన్నికల్లోను కొత్తవారే ఇక్కడ పోటీకి దిగుతున్నారు. ఈసారి పాత వారితో పాటు కొత్త వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్‌ తనకు ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని పార్టీని కోరుతున్నారు. మరో వైపు తెలుగుదేశం పార్టీలోకి ఇద్దరు సీనియర్‌ నాయకులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఒకరు అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కాగా మరొకరు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ. ఈ ఇద్దరు అనకాపల్లి ఎంపీలుగా గెలుపొందిన వారే. ఎవరిని పోటీకి దించినా ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు, అక్కడి అభ్యర్థుల పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. దీనిని కూడా పార్టీ అంచనా వేస్తోంది. అనకాపల్లి, చోడవరం, ఎలమంచిలి, నర్సీపట్నం, పాయకరావుపేట, మాడుగుల, పెందుర్తి నియోజకవర్గాలు అనకాపల్లి పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. ఆయా నియోజవర్గాల్లో మాడుగుల మినహా మిగిలిన అన్నిచోట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, సీనియర్లు ఉన్నారు. వారిని కలుపుకొని వెళ్లగలిగే శక్తి ఎంపీ అభ్యర్థికి ఉండాలి. ఒకరి వల్ల మరొకరి ఓటింగ్‌కు నష్టం జరుగుతుందనుకుంటే…అంగీకరించే పరిస్థితి లేదు.

ఎంపీ అభ్యర్థి సిటింగ్‌ ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టాల్సి ఉంది. వీటిని కూడా పార్టీలో దృష్టిలో ఉంచుకొని ఆచితూచి వ్యవహరిస్తోంది. విశాఖ డెయిరీతో జిల్లాలోని గ్రామీణ రైతులతో పెనవేసుకుపోయిన ఆడారి తులసీరావు ఈసారి తన కుటుంబాన్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లూ పార్టీకి అండగా వుంటూ, తాను ఉండే ఎలమంచిలి ప్రాంత రాజకీయాలకు మాత్రమే పరిమితమైన ఆయన ఈసారి అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి తన కుమారుడు, విశాఖ డెయిరీ సీఈఓ ఆడారి ఆనంద్‌ను రంగంలో దించాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టిలో పెట్టారు. జిల్లాలో మద్దతు కూడగట్టుకోవడానికి ఇప్పటికే ఒక మంత్రితో సంప్రతింపులు జరిపారు. పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతోను చర్చిస్తున్నారు. తమకు అండగా వుండాలని కోరుతున్నారు. జిల్లాలో మరో సీనియర్‌ మంత్రిని సోమ, మంగళవారాల్లో కలవాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు.

ఇక తాజాగా ఓ పారిశ్రామికవేత్త పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. దీనిపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. ఆయనే బ్రాండిక్స్‌ కంపెనీ ఇండియా పార్టనర్‌ దొరస్వామి. ఈయన స్వస్థలం చిత్తూరు జిల్లా. కొన్నేళ్ల క్రితం బ్రాండిక్స్‌లో భాగస్వామిగా చేరారు. అప్పటి నుంచి ఆ కంపెనీకి బ్రాండ్‌ ఇమేజ్‌ తేవడానికి సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నారు. కంటి వైద్య శిబిరాల ద్వారా ఆ ప్రాంతంలోని పేదల కళ్లల్లో వెలుగులు నింపుతున్నారు. పరిసర గ్రామాలకు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటున్నారు. ఈయన కూడా అనకాపల్లి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రిజర్వేషన్ల ప్రకారం అనకాపల్లి స్థానాన్ని కాపులకు లేదంటే బీసీలకు కేటాయించాల్సి ఉంటుంది.

Copy Protected by Chetan's WP-Copyprotect.