వైసీపీకి సీమలో మరో “రెడ్డి గారు” గుడ్‌ బై!

వైసీపీలో అసమ్మతి సెగలు తారాస్ధాయికి చేరుకున్నాయి. ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టికెట్ ఆశించిన నేతలు టికెట్ దక్కకపోవడంతో రగిలి పోతున్నారు. అంతేకాదు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ శ్రీశైలం నియోజకవర్గ అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డిని ప్రకటించింది. దీంతో ఆ పార్టీ నేత బుడ్డా శేషారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆయన పార్టీని కూడా వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

అయితే శేషారెడ్డికి శ్రీశైలం టికెట్ ఇవ్వాలని ఆయన సోదరుడు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. ఇప్పటికే శ్రీశైలం అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు. తమ్ముడు శేషారెడ్డి కోసం సీటు త్యాగం చేసేందుకు రాజశేఖర్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. మంగళవారం కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పోటీపై బుడ్డా సోదరులు నిర్ణయం తీసుకోనున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బుడ్డా రాజశేఖర్ శ్రీశైలం నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. అయితే ఆయన సోదరుడు శేషారెడ్డి వైసీపీలోనే కొనసాగారు. పార్టీల నుంచి టికెట్ ఆశించిన నేతలు చివరి నిమిషంలో టికెట్ దక్కక పోవడంతో ఆయా పార్టీలపై దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. రోజులు తిరగకుండానే ఇతర పార్టీల్లోకి చేరేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఓ టీడీపీ నేత మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. శ్రీశైలం నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బుడ్డా రాజేశేఖర్‌రెడ్డి పేరును టీడీపీ ఖరారు చేసింది.

జాబితాలో కూడా ఆయన పేరును ప్రకటించింది. సోమవారం నుంచే నామినేషన్‌ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే ఇలాంటి సమయంలో రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నానని బుడ్డా రాజశేఖరరెడ్డి చేసిన ప్రకటన కలకలం రేపింది. బుడ్డా తీసుకున్న ఈ నిర్ణయం కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది. టికెట్ ఖరారు తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పేనని, తనకు తెలుగుదేశం పార్టీ అన్ని అవకాశాలు కల్పించిందని చెప్పారు. కుటుంబ పరిస్థితుల వల్ల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని బుడ్డా తెలిపారు. అయితే బుడ్డా తప్పుకోవడంతో ఆయన అనుచరులు నిరాశకు గురవుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి రాజకీయాల్లో కొనసాగాలని కార్యకర్తలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. రాజశేఖర్‌రెడ్డి నిర్ణయం తట్టుకోలేని ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే తన సోదరుడైన శేషారెడ్డికి శ్రీశైలం టికెట్ ఇవ్వాలని బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. శ్రీశైలం నుంచి వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ తన తమ్ముడు శేషారెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరిన బుడ్డా తమ్ముడి కోసం సీటు త్యాగం చేసేందుకు కూడా సిద్ధపడ్డారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.