బాబు స్కెచ్‌తో ఆ వైసీపీ సిట్టింగ్ ఎంపీ స్థానం టీడీపీ ఖాతాలోకి

సీమలో టీడీపీని మాంచి ఫామ్ లోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు సూపర్ స్కెచ్ వేస్తున్నారు. ఆ వైసీపీ సిట్టింగ్ ఎంపీ స్థానం టీడీపీ ఖాతాలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఏమిటా బాబుగారి ప్లాన్ అని అనుకుంటున్నారా..? కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో పాగా వేయడమే.. ఆ ప్రాంతంలో బలహీనంగా ఉన్న టీడీపీకి బలమైన నాయకత్వాన్ని అందివ్వడంతో పాటు అక్కడ పాతుకుపోయిన పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలన్నది చంద్రబాబు ఆలోచన.

గతంలో పీలేరు.. ఇప్పుడు పుంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికీ పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో బలమైన వర్గాన్ని కలిగి ఉన్నారు. ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపీ. నల్లారి కుటుంబానికి తొలి నుంచీ సదుం, సోమల మండలాల్లో గణనీయమైన పలుకుబడి ఉంది. అంతే కాకుండా మదనపల్లె, తంబళ్లపల్లెల్లోనూ నల్లారి అనుచరవర్గం ఉంది. ఇప్పుడు కొంతమేరకు అధికారం కూడా తోడు కావడంతో పుంగనూరులో పెద్దిరెడ్డిని, రాజంపేటలో మిథున్‌రెడ్డిని దెబ్బతీసి ఆయా స్థానాల్లో టీడీపీకి విజయం సాధించి పెట్టేందుకు కిశోర్‌ దూకుడుగా వెళ్లే అవకాశాలున్నాయి. గతంతో పోలిస్తే వ్యవహారశైలినీ ఎంతగానో మార్చుకుని శ్రేణులకు దగ్గరవుతున్న ఆయన టీడీపీ, ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. నల్లారి కిశోర్ మీద చంద్రబాబు దృష్టి పెట్టారు, పార్టీలో చేర్చుకునే సందర్భంలో కిశోర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయించిన సమయం, ఇచ్చిన ప్రాధాన్యం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

పార్టీలో తమ నేతకు సముచిత గౌరవం లభిస్తుందని భావించిన అనుచరవర్గం ఆయన పార్టీలో చేరినపుడు పెద్దసంఖ్యలో విజయవాడకు తరలివెళ్లింది. బలమైన నాయకత్వం లేక సతమతమవుతున్న టీడీపీ శ్రేణులు సైతం కిశోర్‌ రాకను మనస్ఫూర్తిగా స్వాగతించాయి. ఇక స్వల్ప వ్యవధిలోనే ఆయనకు ఐడీసీ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టడంతో టీడీపీలోని పాత, కొత్త శ్రేణుల సంబరం చెప్పనలవి కాకుండాపోతోంది.గత ఇరవై ఏళ్లుగా పార్టీ జెండా ఎగరని పీలేరు నియోజకవర్గంలో శ్రేణుల ఆనందోత్సాహాలు వేరే స్థాయి లో ఉన్నాయి. వరుసగా నాలుగు ఎన్నికల్లోనూ ఓటమే ఎదురుకావడంతో నాయకత్వ కొరత తలెత్తింది. దీంతో శ్రేణుల్లోనూ నైరాశ్యం అలముకుంది. ఇదే నియోజకవర్గంలో సుమారు 30 ఏళ్లుగా తెరవెనుకే ఉండి రాజకీయా లు నడిపిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి అండగా నిలిచిన ఆయన సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి సంక్లిష్ట పరిస్థితుల్లో గత ఎన్నికలప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అటు తమకు, ఇటు నియోజకవర్గానికి విలువైన సేవలందించిన కిశోర్‌ ఓటమి చెందడం నల్లారి కుటుంబ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

గతేడాది చివరన కిశోర్‌ టీడీపీలో చేరడంతో నియోజకవర్గంలోని బలమైన ఈ రెండు వర్గాలూ ఒక్కటయ్యాయి. దాంతో రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారిపోయాయి. పెద్దిరెడ్డి కుటుంబంతో ఎప్పటి నుంచో వైరం ఉన్న నల్లారి కుటుంబం సైతం వచ్చే ఎన్నికల్లో రాజంపేట లోక్ సభ స్థానంతో పాటు పీలేరు, మదనపల్లె, తంబళ్ళపల్లె నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి కుటుంబ ఆధిక్యానికి గండి కొట్టాలని చూస్తున్నారు. కాగా 14 ఎన్నికల్లో రాజంపేట,తంబళ్ళపల్లె అసెంబ్లీ స్థానాల్లో తెదేపా అభ్యర్ధి విజయం సాధించారు. మిగతా చోట్ల వైకాపా విజయం సాధించింది. ఇప్పుడు నల్లారి కుటుంబ బలం టీడీపీ కి కలవటంతో రాజంపేట ఎంపీ స్థానం తెలుగుదేశం ఖాతాలోకి వచ్చినట్టే అని లెక్కలు చెప్తున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీజేపీ తరపున లోక్ సభకి పోటీ చేసిన పురందేశ్వరి ఓడిపోయిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం వచ్చే ఎన్నికలు నాటికి కొన్ని అస్త్రాలను సిద్ధం చేసి పెట్టుకుంటోంది. ప్రత్యర్థి బలాన్ని దెబ్బతీసేందుకు వ్యూహాలు తయారు చేసింది.

కడప జిల్లాలో రెండో ఎంపీ సీటు రాజంపేట గెలిచేందుకు టీడీపీ రెండంచెల వ్యూహం ఇదే. 1957 తర్వాత ఇప్పటిదాకా 15 సార్లు ఆ ఎంపీ సీటుకు ఎలక్షన్స్‌ జరిగితే తెలుగుదేశం గెలిచింది కేవలం రెండేసార్లు. టీడీపీకి అంత వెనుకబాటుతనం ఉన్న ఎంపీ సీటును ఎలాగైనా జయించాలి. అప్పుడే కిక్కుంటుందని తెలుగుదేశం డిసైడ్‌ అయింది. మొదటి వ్యూహంలో భాగంగా వైసీపీ ఆధిపత్యాన్ని బద్ధలు కొట్టేందుకు ఆ నియోజకవర్గం నుంచి గతంలో ఆరు సార్లు లోక్‌సభ సభ్యుడిగా నెగ్గిన, ఆ నియోజకవర్గంలో అత్యంత బలమైన ఓటు బ్యాంకు అయిన బలిజ వర్గానికి చెందని నేత సాయిప్రతాప్‌ ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. కడప, చిత్తూరు జిల్లాల్లో తమకంటే పైచేయిగా ఉన్న వైసీపీని కకావికలం చేయాలన్నది తాజాగా టీడీపీ ఎత్తుగడ. అనేక దశాబ్దాలుగా చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించిన రాజకీయ కుటుంబాలలో నల్లారి ఫ్యామిలీ ఒకటి. సాయి ప్రతాప్, నల్లారిల సహకారంతో రాజంపేట ఎంపీ ఈసారి టీడీడీ గెలుపు పక్కా అంటున్నారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.