కర్నాటకలో ఈ లెక్కన బీజేపీకి 5 ఎంపీ సీట్లు కూడా రావు

కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి తాజా ఉపఎన్నికల్లో దక్కిన భారీ విజయం 2019 సార్వత్రిక ఎన్నికల సమీకరణాలను సమూలంగా మార్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫలితాలతో కనీసం 5 ఎంపీ సీట్లు అయినా వస్తాయా బీజేపీకి అనే అనుమానం వస్తోంది. జేడీఎస్ – కాంగ్రెస్ కూటమి ‘‘కమల’’నాధులకు చుక్కలు చూపించడం… అటు జాతీయ రాజకీయాల్లో, ఇటు కర్ణాటక రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. ఒక్క శివమొగ్గ తప్ప మిగతా నాలుగు చోట్ల ఇవాళ బీజేపీ బొక్క బోర్లా పడింది. బళ్లారి లోక్‌సభ, జమఖండి అసెంబ్లీ స్థానాల్లో పార్టీ ఓటమి కంటే..

అక్కడ కాంగ్రెస్‌కు దక్కిన భారీ మెజారిటీనే బీజేపీని మరింత షాక్‌కు గురిచేసింది. ఈ రెండు స్థానాల్లో ఏదో ఒకచోటైనా విజయం సాధిస్తామని బీజేపీ కౌంటింగ్ చివరిదాకా ఎదురు చూసినా ఫలితం మారలేదు. బళ్లారిలో వీఎస్ ఉగ్రప్ప ఏకంగా 2 లక్షలకు పైగా ఓట్లతో విజయ బావుటా ఎగరేయగా.. జమఖండిలో అనంద్ న్యామగౌడ 39 వేల ఓట్ల మెజారిటీతో సంచలన విజయం నమోదు చేశారు. ఉత్తర కర్ణాటకలో ఈ రెండు స్థానాలు బీజేపీకి కంచుకోటల్లాంటివి కావడం విశేషం. ఈ రెండు చోట్లా బీజేపీకి ప్రధానమైన ఓటర్లుగా భావించే లింగాయత్‌లు అత్యధికంగా ఉన్నారు. మరోవైపు కర్ణాటక బీజేపీ చీఫ్ బీఎస్ ఎడ్యూరప్పకు తిరుగులేదని భావించే శివమొగ్గలో సైతం ఫలితాలు ఆసక్తి రేపాయి. ఎడ్యూరప్ప తనయుడు బీవై రాఘవేంద్ర.. జేడీఎస్ అభ్యర్థి బంగారప్పపై నామమాత్రపు ఓట్ల తేడాతో విజయం దక్కించుకోవడం కాషాయపార్టీని మరింత కలవరపెడుతోంది.

2014 ఎన్నికల్లో ఎడ్యూరప్ప ఇక్కడ నుంచి 3.5 లక్షల భారీ మెజారిటీతో గెలవడం గమనార్హం. ఉపఎన్నికల్లో ఎదురైన పరాభవంతో కంగుతిన్న ఎడ్యూరప్ప మధ్యాహ్నం వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. శివమొగ్గలో అత్యంత కష్టంగా 60 వేల ఓట్లతో తన కుమారుడు గట్టెక్కడం ఎడ్యూరప్పను మరింత కలవరపాటుకు గురిచేసినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది సేపటికే బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సురేశ్ కుమార్‌ను పిలిపించుకుని ఎడ్యూరప్ప సమాలోచనలు జరిపారు. మరో వైపు తాజా ఎన్నికల ఫలితాలు కర్ణాటకలో బీజేపీకి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పార్టీ నాయకత్వంలో సమూల మార్పులు చేయాలంటూ కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇవాళ వెలువడిని ఎన్నికల ఫలితాలపై జేడీఎస్, కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కర్ణాటకలో బీజేపీ పతనం మొదలైందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమంటూ ఆ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.