గజ్వేల్‌లో కేసీఆర్‌ ఓటమిని హరీష్‌ ఆపగలడా?

2014 ఎన్నికల్లో హరీష్‌ రావు గజ్వేల్‌లో తిరగకపోతే కేసీఆర్ అప్పుడే గ్యారంటీగా ఓడిపోయేవాడు. కేవలం 18 వేల ఓట్లతో వంటేరు ప్రతాపరెడ్డిపై అప్పుడు గెలిచాడు. అప్పుడు కాంగ్రెస్‌కు 36 వేల ఓట్లు వచ్చాయి. ఈసారీ టీడీపీ కాంగ్రెస్ ఓట్లు కలిసిపోయాయి కాబట్టి కేసీఆర్‌కు వచ్చిన ఓట్ల కంటే 20 వేలకు పైగా కూటమికి ఆధిక్యం అవుపిస్తోంది. కేసీఆర్‌పై ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్ల గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే తక్కువ ఓట్లు వస్తే అది హరీష్ మెడకు చుట్టుకునే ప్రమాదముంది అంటున్నారు.

తాజాగా కాంగ్రెస్ నాయకుడు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి హరీష్ రావుపై చేసిన కామెంట్స్ తరువాత ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. హరీష్‌రావు ప్రస్తుత ఎన్నికల్లో ఒక బంతిగా మారారని.. అటు విపక్షం ఇటు స్వపక్షం ఆడుకుంటున్నాయని అభిప్రాయం ఉంది. అసెంబ్లీ రద్దు తరువాత సొంత పార్టీలో ఏది జరిగినా అది చివరికి హరీష్‌రావు వద్దకు వచ్చి ఆగిపోతుంది అంటున్నారు. ఎక్కడ అసంతృప్తి వినిపించనా.. ఎవరూ పార్టీ నుంచి వదలి వెళ్లినా దాని వెనుక హరీష్ వర్గీయుల హస్తముందా అనే అనుమానం కోణంలో పార్టీలో గుసగుసలు ఉన్నాయి. సొంత పార్టీలో హరీష్‌కు వివక్ష ఉందని… ఆయన్ను పక్కన పెట్టే ప్రయత్నాలు తీవ్రంగా జరిగాయనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఆ సమయంలోనే హరీష్ రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ భావోద్వేగంగా మాట్లాడడంతో టీఆర్‌ఎస్ నాయకులే విస్తుపోయారు. హరీష్‌కు ఎన్ని అవమానాలు జరిగితే అలా మాట్లాడరంటూ చర్చించుకున్నారు. ఇలా చర్చించుకోవడం పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందని గ్రహించారు కేసీఆర్.

అందుకే కంటితుడుపుగా కేటీఆర్, హరీష్‌ల మధ్య సయోధ్య కోసం కార్యకర్తల సమావేశంలో బావ బామ్మర్ధులను ఒకే వేదిక మీదికి కనిపించేలా ఏర్పాట్లు చేసారని చెప్పుకుంటున్నారు. ఇటు హరీష్ అటు కేటీఆర్ ఇరువురు ఎవరి ప్రచారం వారు చేసుకుంటున్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి హరీష్‌పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దూమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలు టీఆర్‌ఎస్ పార్టీని ఒక కుదుపు కదుపేసాయి. ఒంటేరు కామెంట్లను వెంటనే హరీష్ ఖండించినా.. హరీష్ తీరుపై మాత్రం టీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయన ఎంత నిజాయితీగా గజ్వేల్లో పనిచేసినా ఏ చిన్నలోపం జరిగినా అది హరీష్ ఫెయిల్యూర్ జాబితాలో పడేస్తారు. కేసీఆర్ ఓడిపోయే పరిస్థితి ఇప్పుడు పక్కాగా కనిపిస్తోంది. అదే జరిగితే ఆ పాపాన్ని హరీష్‌పై వేసేసేలా ఉన్నారు. వంటేరు ప్రతాప్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరే అవకాశముంది. ఒకవేళ భారీ మెజారిటీతో వస్తే మాత్రం అది కేసీఆర్ ఇమేజీ వల్లే వచ్చిదని చెప్పుకుంటారు. అందుకని హరీష్ ఈ ఎన్నికల్లో తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి ఉందంటున్నారు.

Copy Protected by Chetan's WP-Copyprotect.