రేవంత్‌, హరీశ్‌లపై గురి! పావులు కదుపుతున్న బీజేపీ!

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరుస్తూ వస్తున్నందున అధికార పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి బీజేపీ రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసుకుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ఇప్పటికే వేల సంఖ్యలో తెలంగాణలోని గ్రామాలలో పర్యటిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో బలమైన రెడ్డి సామాజికవర్గంపై బీజేపీ కన్ను పడింది. ఈ సామాజిక వర్గం నాయకులు ఇప్పటివరకు కాంగ్రెస్‌కు అండగా ఉన్నారు. తాజా ఎన్నికలలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పనితీరు పేలవంగా ఉండటం, పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి రాహుల్‌గాంధీ ససేమిరా అంటూ ఉండటంతో కాంగ్రెస్‌ శ్రేణులలో భవిష్యత్తు పట్ల భరోసా సన్నగిల్లుతోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో బీజేపీలోకి వలసలు పెరిగే అవకాశముంది.

ప్రజల్లో గ్లామర్‌ ఉన్న కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడానికై బీజేపీ నాయకులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులను కూడా కమల నాథులు టార్గెట్‌ చేసుకున్నారు. ‘‘తమిళనాడు తరహాలో రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు ఉంటే ఏదో ఒకటి అధికారంలో ఉంటుందనీ, జాతీయ పార్టీలకు స్థానం ఉండదనీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవలే చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం?’’ అని రాజకీయ పరిశీలకులు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం కేసీఆర్‌ నిర్లక్ష్యానికి గురవుతున్న హరీశ్‌రావు వైపు అందరి చూపు మళ్లుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణం సమయంలో గొడ్డుచాకిరీ చేసిన హరీశ్‌రావుకు ఆ ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా చోటు కల్పించకపోవడం ప్రజలలో చర్చనీయాంశం అయింది. హరీశ్‌రావును ఉద్దేశ పూర్వకంగా అవమానిస్తున్నారన్న అభిప్రాయం నానాటికీ బలపడుతోంది.సామాజిక మాధ్యమాలలో కూడా ఆయనకు మద్దతు పెరుగుతోంది. ‘‘ఈ తరుణంలో హరీశ్‌రావు అడుగులు ఎటు పడబోతున్నాయా?’’ అని తెలంగాణ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ‘‘హరీశ్‌రావు తమ పార్టీలో చేరితే బాగుంటుందని కమల నాథులు ఆశపడుతున్నారు గానీ, ఆయన ఆ పని చేయరు’’ అని హరీశ్‌ సన్నిహితులు చెబుతున్నారు.

కేసీఆర్‌ను ఎదిరించే పరిస్థితి నిజంగా వస్తే హరీశ్‌రావు సొంత పార్టీ ప్రారంభిస్తారన్న అభిప్రాయం బలంగా ఉంది. అదే జరిగితే ఆయన వచ్చే ఎన్నికలలో పరిస్థితిని బట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితిలో హరీశ్‌రావు పరిణామం కూడా కమల నాథులలో ఆశలు నింపుతోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్‌ పార్టీని కోలుకోకుండా చేస్తున్న కేసీఆర్‌, మున్ముందు తనకు ముప్పుగా పరిణమించే అవకాశమున్న బీజేపీని ఎలా కట్టడి చేయబోతున్నారో వేచి చూద్దాం! కేసీఆర్‌ నిజంగా సీరియస్‌గా దృష్టి పెట్టి 24×7 రాజకీయం స్టార్ట్ చేస్తే బీజేపీ ఉక్కిరిబిక్కిరి అవుతుందని తెరాస వర్గాలు ధీమాగా ఉన్నాయి.

Copy Protected by Chetan's WP-Copyprotect.