టీడీపీలో ఇక వరుస చేరికలు! జాబితా సిద్ధం చేసి తేదీలు ఫిక్స్ చేస్తున్న సీఎం!

ఈనెల 28న కోట్ల కుటుంబం కోడుమూరులో భారీ బహిరంగ సభ పెట్టి సీఎం సమక్షంలో టీడీపీలో చేరటానికి ముహుర్తం ఫిక్స్ అయింది. అందుకు అనుగుణంగా సీఎం కూడా కర్నూలు టూరుకు 28న డేట్ ఇచ్చారు. అలాగే చేరాల్సిన నాయకుల లిస్టు ముందు పెట్టుకుని వరుసగా వారికి తేదీలు ఇస్తున్నారు సీఎం చంద్రబాబు. హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్న టీడీపీ లీడర్లను టార్గెట్‌ చేస్తూ బీజేపీ, తెరాస వారిని వైసీపీలో చేర్పించటంపై సీఎం ఆగ్రహంతో ఉన్నారు.

దానికి కౌంటర్ స్ట్రాటజీని ఆయన తయారు చేస్తున్నారు. టికెట్ ఇవ్వకుండా తాను రిజెక్ట్ చేసిన వారిని చేర్చుకున్నందుకే ఇంత హడావుడి చేస్తున్న వైకాపాకు కోలుకోలేని షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. వచ్చే వారం నుంచి రోజూ.. చేరికల కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారు. పార్టీలోకి వస్తామని చెబుతున్న వారికి తలుపులు తెరవాలని నిర్ణయం టీడీపీలోకి కోట్ల , సబ్బం , కొణతాల రామకృష్ణ, కిషోర్ చంద్రదేవ్ లతో పాటు మరికొందరు నేతలు రానున్నారు. వీరందరూ ఇప్పటికే.. హైకమాండ్‌తో చర్చలు జరిపారు. బెజవాడ నుంచి వంగవీటి రాధా, కడప జిల్లాలో డీఎల్ రవీంద్రారెడ్డి ఒకరు జాబితాలో ఉన్నారు. అదే జిల్లాలో మైనార్టీ వర్గానికి చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా టీడీపీలో ఇటీవలే సీఎం సమక్షంలో చేరారు. ఇక అనంతపురం జిల్లాల్లో శింగనమలలో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న యామినిబాలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి శైలజానాథ్‌ను పార్టీలోకి చేర్చుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ మాజీ మంత్రి, ప్రముఖ దళిత నేత శైలజానాథ్‌ పార్టీలోకి వస్తే ఆయనకు శింగనమల ఎమ్మెల్యే సీటు కేటాయించే అవకాశం ఉంది. అలాగే ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి క్లియర్‌గా తెలుస్తోంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు కూడా చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే గ్రీన్ సిగ్నల్‌ కూడా వచ్చిందని సమాచారం. ఇక ఉత్తరాంధ్రలో మరో కీలక నేత దాడి వీరభధ్రరావు లాంటి నేతలను కూడా ఆపరేషన్‌ స్వగృహ పేరుతో పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీలో ఆయనతో సన్నిహితంగా ఉన్న కొందరు నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. చీరాలలో వైసీసీ నేత బాలాజీ కూడా టీడీపీ లోకి రాబోతున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు విష్నువర్థన్‌ రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌ రెడ్డి కూడా సీఎంను కలిసి తెదేపాలో చేరతామని హామీ ఇచ్చారు. సో ఇక వచ్చే వారం అంతా సందడే సందడి.

Copy Protected by Chetan's WP-Copyprotect.